Odisha: ఒడిశాలో కొలువుదీరిన భాజపా ప్రభుత్వం

ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్‌ చరణ మాఝి బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 13 Jun 2024 06:20 IST

15వ సీఎంగా మోహన్‌ చరణ మాఝి ప్రమాణస్వీకారం
హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌
భువనేశ్వర్‌ - న్యూస్‌టుడే

ప్రధానమంత్రి మోదీకి పుష్పగుచ్ఛం ఇస్తున్న మోహన్‌ చరణ మాఝి

ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్‌ చరణ మాఝి బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా కనకవర్ధన్‌ సింగ్, ప్రభాతి పరిడ, 8 మంది క్యాబినెట్‌ మంత్రులుగా, ఐదుగురు స్వతంత్ర హోదా గల మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. 

మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల గెలిచిన భాజపా.. రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌ను ఓడించింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాఝీని ప్రకటించింది. ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం ఏర్పడటంతో ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. పాతికేళ్లుగా ఒడిశాను పాలించిన నవీన్‌ పట్నాయక్‌ను సీఎం మాఝి వ్యక్తిగతంగా కలిసి, ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరై ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని అభినందించడం విశేషం. 

మోహన్‌ చరణ మాఝిని అభినందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

మూడో గిరిజన ముఖ్యమంత్రి

గతంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హేమానంద బిస్వాల్, గిరిధర్‌ గమాంగ్‌.. గిరిజనుల నుంచి ఒడిశాకు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. తాజాగా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన మోహన్‌ చరణ్‌ మాఝి (52) ప్రముఖ గిరిజన నేత. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవారు. మాఝి విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరయ్యారు. డిగ్రీ పూర్తయిన తర్వాత సరస్వతీ విద్యామందిర్‌లో ఉపాధ్యాయుడిగానూ, తర్వాత న్యాయవాదిగానూ పనిచేశారు. సర్పంచిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కేంఝర్‌ అసెంబ్లీ స్థానం నుంచి 2000, 2009, 2019, 2024ల్లో  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో భాజపా సభా పక్ష కార్యదర్శిగా, చీఫ్‌ విప్‌గా వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని