Monsoon: చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్‌..

Southwest Monsoon: అన్నదాతలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.

Updated : 08 Jun 2023 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. గురువారం ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి.

ప్రస్తుతం లక్షద్వీప్‌, కేరళ (Kerala) ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాల ఆగమన ప్రభావంతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. రానున్న 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. గంటకు 19 నాట్‌ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు ఐఎండీ (IMD) తెలిపింది. అయితే తొలి వారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.

సాధారణంగా జూన్‌ 1వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. వాతావరణ మార్పులు, తుపాను కదలికల కారణంగా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. గతేడాది మే 29న రాగా 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న తీరాన్ని తాకాయి. ఇక, ఈసారి సముద్రంపై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తున్నా... ఈ సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని