Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఇంట్లో మళ్లీ భారీగా నోట్ల కట్టల కలకలం

ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ....

Updated : 27 Jul 2022 22:27 IST

కోల్‌కతా: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో అరెస్టయిన బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ (Partha Chatterjee) సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ (Arpita Mukherjee) ఇంట్లో మరోసారి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గత శుక్రవారం ఈడీ జరిపిన సోదాల్లో ఆమె ఇంట్లో రూ.21కోట్లు బయటపడగా.. తాజాగా మరోసారి భారీ మొత్తంలో డబ్బు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ మధ్యాహ్నం నుంచి సోదాలు కొనసాగించిన ఈడీ అధికారులు ఆమె అపార్ట్‌మెంట్‌లోని షెల్ఫ్‌లో నోట్ల కట్టలు గుర్తించినట్టు సమాచారం. వీటిని లెక్కించేందుకు నగదు లెక్కింపు యంత్రాలను తీసుకురావాలని బ్యాంకు అధికారులకు సూచించారు. అయితే, ఈ రోజే రాత్రంతా వాటిని లెక్కించనున్నట్టు తెలుస్తోంది. అర్పితా ముఖర్జీ ఇంట్లో తాజాగా స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ఇప్పటివరకు రూ.15 కోట్లు కాగా.. ఇంకా లెక్కింపు కొనసాగుతున్నట్టు సమాచారం. వీటిలో డబ్బు, బంగారం, బాండ్ల రూపంలో ఉన్న ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. 

ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో గత శుక్రవారమే అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.21 కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు.. శనివారం మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆమెనూ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఆగస్టు 3వరకు కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించడంతో ప్రస్తుతం ఈడీ విచారణ కొనసాగుతున్న వేళ మళ్లీ భారీగా నోట్ల కట్టలు బయటపడటం గమనార్హం. అయితే, గతంలో అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.21కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో అక్రమంగా వచ్చిన డబ్బేనని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. ‘‘నా ఇంట్లోని ఒక గదిలో పార్థా ఛటర్జీ డబ్బు దాచేవారు. ఆ గదికి మంత్రి, ఆయన మనుషులకు మాత్రమే ప్రవేశం ఉండేది. ప్రతి పదిరోజులలొకసారి ఛటర్జీ మా ఇంటికి వచ్చేవారు. నా ఇంటిని, మరో మహిళ ఇంటిని మినీ బ్యాంకులా ఉపయోగించుకునేవారు. ఆ మహిళ కూడా ఆయనకు సన్నిహితురాలే. ఆ గదిలో ఎంత డబ్బు ఉంచారో మంత్రి ఏనాడు చెప్పలేదు’’ అని అర్పిత విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ నేరారోపణలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్పిత ఇంట్లో అధికారులు ఒక 40 పేజీల డైరీని స్వాధీనం చేసుకోగా.. దాంట్లో దర్యాప్తునకు అవసరమైన కీలక సమాచారం లభించొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని