Corona variants: మున్ముందు మరిన్ని ఆందోళనకర వేరియంట్లు?

‘‘ఒమిక్రాన్‌ వేరియంట్‌ పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. స్వల్ప

Published : 17 Jan 2022 09:00 IST

హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు 

వాషింగ్టన్‌: ‘‘ఒమిక్రాన్‌ వేరియంట్‌ పెద్దగా ప్రమాదకరమేమీ కాదు. స్వల్ప అనారోగ్య లక్షణాలతో దాన్నుంచి బయటపడగలుగుతున్నాం. ఇకపై కరోనా కూడా సాధారణ జలుబులా మారుతుందేమో’’ ప్రస్తుతం చాలామంది నోటి వెంట వినిపిస్తున్న మాటలివి! అయితే ఇప్పుడే అంతలా ఆనందపడొద్దని హెచ్చరిస్తున్నారు అమెరికాలోని బోస్టన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త లియోనార్డో మార్టినెజ్, జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త స్టువర్ట్‌ క్యాంప్‌బెల్‌ రే. కరోనాలో మున్ముందు మరిన్ని ఆందోళనకర వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పుందని వారు చెబుతున్నారు. మార్టినెజ్, రే విశ్లేషణ ప్రకారం.. తొలిసారి వెలుగుచూసిన కరోనా వేరియంట్‌తో పోలిస్తే 4 రెట్లు, డెల్టా కంటే రెండు రెట్లు అధిక వేగంతో ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతోంది.

ఒమిక్రాన్‌ ఎక్కువ మందిలోకి ప్రవేశిస్తోందంటే.. ఉత్పరివర్తనం చెందేందుకు వీలుగా దానికి ఎక్కువ వేదికలు దొరుకుతున్నట్లే. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తుల్లోకి అది ప్రవేశిస్తే.. వారిలో ఎక్కువ కాలం ఉండి, మరింత ప్రమాదకరంగా రూపాంతరం చెందే ముప్పుంటుంది. కాలం గడిచేకొద్దీ వైరస్‌లు తక్కువ ప్రాణాంతకంగా మారతాయని చెప్పేందుకు ఆధారాలేవీ లేవు. శునకాలు, పిల్లుల వంటివాటితో పాటు ఇతర జంతువుల్లోకి వైరస్‌ ప్రవేశించి.. వాటిలో ప్రమాదకర వేరియంట్లుగా ఉత్పరివర్తనం చెంది తిరిగి మానవుల్లోకి చొరబడే అవకాశాలూ లేకపోలేదు. ప్రస్తుతం ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు రెండూ వ్యాప్తిలో ఉన్నాయి. ఒకే వ్యక్తిలో అవి ప్రవేశించి మిశ్రమ వేరియంట్‌ పుట్టుకొచ్చే ముప్పు కూడా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని