Road Accidents: యుద్ధంలో కన్నా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మరణాలు: వీకే సింగ్‌

యుద్ధంలో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే భారత్‌ ఎక్కువమంది పౌరులను కోల్పోతోందని కేంద్ర రవాణాశాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ అన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్య అని వ్యాఖ్యానించారు. శుక్రవారం...

Published : 14 May 2022 02:27 IST

దిల్లీ: యుద్ధంలో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే భారత్‌ ఎక్కువ మంది పౌరులను కోల్పోతోందని కేంద్ర రవాణాశాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ అన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వం పరిష్కరించాల్సిన ముఖ్యమైన సమస్య అని వ్యాఖ్యానించారు. శుక్రవారం అసోచామ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఏటా 1.35 లక్షలకుపైగా భారతీయులు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య.. యుద్ధం చేయడం కంటే దారుణంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. దురదృష్టవశాత్తు మన దేశంలో రోడ్డు భద్రత అనేది ఏడాదికోసారి వచ్చే కార్యక్రమంగా పరిగణిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘గతంలో రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. ప్రస్తుతం దాన్ని మాసోత్సవాలుగా అప్‌గ్రేడ్ చేశాం. కానీ, ఇది 365 రోజుల వ్యవహారంగా ఉండాలి’ అని అభిప్రాయపడ్డారు. ‘ఇది ఒక వారానికి.. నెలకు పరిమితమైన అంశం కాదు. ఎందుకంటే.. ఇది చాలా తీవ్రమైన సమస్య’ అని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు వాహన తయారీదారులు చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు. రహదారి ప్రమాద మరణాలను తగ్గించడానికి వాహనాలకు తగిన భద్రతా ఫీచర్లు ఉండేలా పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రభుత్వం సైతం అనేక చర్యలు చేపట్టిందని.. ఈ క్రమంలో రహదారి వ్యవస్థను మెరుగుపరచడం, ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దడం వంటి చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ (ఐఆర్‌ఎఫ్) ఛైర్మన్ కేకే కపిల మాట్లాడుతూ.. చట్టాలపై ప్రజలకు అవగాహన, జరిమానాలు అమలు.. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇటీవలి ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2020లో దేశంలో మొత్తం 3,66,138 రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. 1.31 లక్షల మందికి పైగా మరణాలు నమోదు కావడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని