Omicron: అమెరికాలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్‌ కేసులు!

అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. శనివారం న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి....

Updated : 05 Dec 2021 17:05 IST

వాషింగ్టన్‌: అమెరికాలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. శనివారం న్యూయార్క్‌లో మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సంకేతాలు కనిపిస్తున్నాయని ఆ రాష్ట్ర హెల్త్‌ కమిషనర్‌ మేరీ బాసెట్‌ తెలిపారు. 

ఒమిక్రాన్‌ కేసులు పాకిన రాష్ట్రాల జాబితాలో తాజాగా మసాచ్యుసెట్స్‌, వాషింగ్టన్‌ కూడా చేరాయి. శనివారం అక్కడ తొలి కేసులు నమోదయ్యాయి. శుక్రవారం న్యూజెర్సీ, జార్జియా, పెన్సిల్వేనియా, మేరీలాండ్‌, మిసౌరీలో కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. వీటితో పాటు నెబ్రాస్కా, కాలిఫోర్నియా, హవాయి, కొలరెడో, ఉటాలోనూ ఒమిక్రాన్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 

న్యూయార్క్‌ రాష్ట్రంలో నమోదైన ఎనిమిది కేసుల్లో ఏడు గ్లోబల్‌ సెంటర్‌గా ఉన్న న్యూయార్క్‌ నగరంలోనే వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల వ్యవధిలో ఈ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు రెండింతలకు పెరగడం గమనార్హం. మరోవైపు డెల్టా వేరియంట్‌ వ్యాప్తితో ఇప్పటికే అక్కడి ఆసుపత్రులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ఈ తరుణంలో కొత్త వేరియంట్‌ కూడా వ్యాపిస్తుండడం అక్కడి యంత్రాంగాన్ని కలవరపరుస్తోంది. అత్యవసరం కాని చికిత్సలను వాయిదా వేయాలని అధికారులు ఆసుపత్రులను ఆదేశిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని