Vaccination: 15-18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్.. మధ్యాహ్నానికి16.85లక్షల మందికి టీకా

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి తొలి రోజే విశేష స్పందన లభించింది. ఈ ఉదయం నుంచి టీనేజీ పిల్లలకు డోసుల పంపిణీని ప్రారంభించగా.

Updated : 03 Jan 2022 15:11 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి తొలి రోజే విశేష స్పందన లభించింది. ఈ ఉదయం నుంచి టీనేజీ పిల్లలకు డోసుల పంపిణీని ప్రారంభించగా.. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 16.85లక్షల మందికి టీకాలు వేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ వయసు వారికి టీకాల కోసం జనవరి 1న రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. కొవిన్‌ యాప్‌లో ఇప్పటివరకు దాదాపు 27లక్షల మంది టీనేజర్లు టీకాల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. టీనేజర్లకు టీకాల కోసం చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాయి. పెద్దలతో పాటు కాకుండా వీరి కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనూ టీకాలు అందిస్తున్నారు. 

దేశంలో కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ పరిధిని విస్తరిస్తూ కేంద్రం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి టీకా అందించనున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ వయసు వారందరికీ కొవాగ్జిన్‌ టీకాను మాత్రమే అందిస్తున్నారు. తొలి డోసు తీసుకున్న 4 వారాల తర్వాత రెండో డోసును వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్యమంత్రి వెల్లడించారు. 2007, అంతకంటే ముందు జన్మించినవారు టీకా వేసుకునేందుకు అర్హులుగా పేర్కొన్నారు. 

వ్యాక్సిన్‌ కోసం కొవిన్‌ యాప్‌లో పేరు రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌ కార్డు లేని వారు.. స్టూడెంట్‌ ఐడీ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో నమోదు చేసుకోవచ్చని కేంద్రం ఇదివరకే వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని