ఆ అమ్మాయిని డాక్టర్‌ను చేసేందుకు.. కలెక్టర్‌, ఉద్యోగులు కదిలివచ్చి..!

Employees donate day’s salary: 200 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓ అమ్మాయి చదువుకోసం తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ సంఘటన గుజరాత్‌లోని బరూచ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 

Published : 16 May 2023 17:39 IST

గాంధీ నగర్‌: ఓ అమ్మాయిని వైద్యురాలిగా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా కదిలివచ్చారు. ఆమెకోసం కలెక్టర్‌తో సహా 200 మంది ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. అలా రెండో సెమిస్టర్‌ ఫీజు చెల్లించేందుకు వారంతా సహకరించారు. అయితే ఇదివరకే ఆ విద్యార్థినికి ప్రధాని మోదీ మధ్య ఉద్వేగపూరిత సంభాషణ చోటుచేసుకోవడం గమనార్హం. ఇంతకీ విషయం ఏంటంటే..? (employees donate day’s salary) 

గుజరాత్‌(Gujarat)లోని బరూచ్‌(Bharuch) ప్రాంతానికి చెందిన ఆలియాబాను(Aaliyabanu) వైద్యవిద్య(MBBS student)ను అభ్యసిస్తోంది. ఆమె వడోదరాకు చెందిన పారుల్ యూనివర్సిటీలో ప్రస్తుతం మొదటి సెమిస్టర్ పూర్తి చేసింది. ‘మొదటి సెమిస్టర్ మేలో పూర్తయింది. దానికోసం మేం రూ.7.70లక్షల ఫీజు చెల్లించాం. ఒక ప్రైవేటు బ్యాంకులో రుణం తీసుకొని, తెలిసినవారి దగ్గర అప్పు చేసి అప్పుడు ఆ మొత్తాన్ని కూడబెట్టాం. కానీ ఇప్పుడు రెండో సెమిస్టర్‌ కోసం రూ.4లక్షలు కావాలి. జూన్‌లో కట్టాలి. సహాయం కోసం ప్రధాని, ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్‌ లేఖ రాశాం. అలాగే ప్రభుత్వ పథకాల కింద దరఖాస్తు చేసుకున్నాం’ అని ఆలియా తండ్రి ఆయూబ్‌ పటేల్ మీడియాకు వెల్లడించారు. 

తాజాగా ఈ లేఖపై జిల్లా కలెక్టర్‌ తుషార్ సుమేరా స్పందించారు. తన సహోద్యోగులు, ఇతర సిబ్బందికి ఆలియా(Aaliyabanu) పరిస్థితి గురించి వివరించారు. వారంతా ఆమెకు సహకరించేందుకు ముందుకు వచ్చారు. తమ ఒక రోజు వేతనాన్ని ఈ ఆదివారం ఆమెకు అందించి, ఆదుకున్నారు. వైద్యవిద్య పూర్తయ్యేవరకు వారికి అండగా నిలిచేలా ప్రణాళికలు వేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. 

అప్పుడు ఆలియా మాటలకు మోదీ ఉద్వేగం..

గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని మోదీ-ఆలియాబాను మధ్య ఉద్వేగపూరిత సంభాషణ చోటుచేసుకుంది. అప్పుడు బరూచ్‌లో జరిగిన కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల్లో ఒకరైన అయూబ్‌ పటేల్‌ను మోదీ పలకరించారు. అప్పుడు అయూబ్ మాట్లాడుతూ.. తన ముగ్గురు కుమార్తెలు చదువుకుంటున్నారని, ఇద్దరికి ప్రభుత్వ స్కాలర్‌షిప్ కూడా వస్తోందని చెప్పారు. అలాగే తన పెద్ద కుమార్తె ఆశయాన్ని ప్రధాని ముందు ఉంచారు. తన కుమార్తె ఇప్పుడు 12వ తరగతి చదువుతోందని.. భవిష్యత్తులో డాక్టర్ కావాలనుకుంటోందని చెప్పారు. ‘ఎందుకు వైద్య వృత్తి వైపు వెళ్లాలనుకుంటున్నావ్..?’ అంటూ అక్కడే ఉన్న ఆ అమ్మాయిని ప్రధాని(PM Modi) ప్రశ్నించారు. ‘అందుకు మా నాన్న అనుభవిస్తున్న బాధే కారణం’అంటూ కన్నీటి పర్యంతమైంది. 

సౌదీ అరేబియాలో పనిచేస్తోన్న సమయంలో కంట్లో వేసుకున్న చుక్కలముందు అయూబ్ చూపును దెబ్బతీసింది. దాంతో ఆయన మిగతావారిలా స్పష్టంగా చూడలేరు. కాగా, ఆయన కుమార్తె చెప్పిన కారణం విన్న ప్రధాని.. భావోద్వేగానికి గురై కొద్దిసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ వెంటనే తేరుకొని, ‘ఇతరుల పట్ల నువ్వు చూపుతున్న కరుణే నీ బలం’ అంటూ ఆమెను మెచ్చుకున్నారు. ఆమె చదువుకు అవసరమైనప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవల మోదీకి లేఖ రాశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని