Go First: 50 మందిని వదిలి వెళ్లిన విమానం.. వివరణ కోరిన డీజీసీఏ

ప్రయాణికులను వదిలేసి గో ఫస్ట్‌ సంస్థకు చెందిన విమానం టేకాఫ్ అయింది. దీనిపై విమర్శలు రాగా..డీజీసీఏ(DGCA) స్పందించింది. 

Published : 10 Jan 2023 20:55 IST

బెంగళూరు: ఏకంగా 50 మంది ప్రయాణికులను వదిలేసి, దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్(Go First Airways)కు చెందిన విమానం టేకాఫ్ అయిన తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో గో ఫస్ట్‌ను డీజీసీఏ (DGCA) వివరణ కోరింది. రెండువారాల్లో నివేదిక ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. సంస్థ ఇచ్చిన వివరణ ఆధారంగా చర్యలు ఉండనున్నాయి.

విమాన సేవలపై విమర్శలు వెల్లువెత్తుతోన్న వేళ.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌(Bengaluru Airport)నుంచి దిల్లీ(Delhi)కి వెళ్లాల్సిన గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌(Go First Airways) విమానం ఒకటి.. ఏకంగా 50 మందికిపైగా ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయింది. ఇదొక భయానక అనుభవమని ప్రయాణికులు ట్వీట్లు చేశారు. ‘ఉదయం 6.20కు విమానం ఉండగా.. 50 మందికిపైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారు. అయితే.. గంటపాటు అందులోనే ఉంచారు. నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ’ అని ట్విటర్‌ వేదికగా విమర్శించారు. 

సతీశ్‌ కుమార్ అనే వ్యక్తి టికెట్ ఫొటోలు షేర్‌ చేస్తూ.. కేవలం ఒక బస్సులోని ప్రయాణికులే విమానంలో ఎక్కారని, మరో బస్సులోనివారంతా ఇక్కడే ఉండిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు.. విమానయాన సంస్థతోపాటు జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. అయితే, తర్వాత వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

సారీ చెప్పిన గో-ఫస్ట్‌

ప్రయాణికులను వదిలివెళ్లిన ఘటనపై గో ఫస్ట్‌ విమానయాన సంస్థ విచార వ్యక్తంచేసింది. కలిగిన అసౌకర్యానికి గానూ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అలాగే, అసౌకర్యం ఎదుర్కొన్న ప్రయాణికులకు ఉచిత టికెట్‌ను ఇవ్వనున్నట్లు తెలిపింది. దేశీయంగా రాబోయే 12 నెలల్లో ఎక్కడికైనా ప్రయాణించేందుకు దీన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిని విచారణ పూర్తయ్యే వరకు రోస్టర్‌ నుంచి తప్పిస్తున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని