Long Covid: 20 లక్షల మందికి దీర్ఘకాలిక కొవిడ్‌!

బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ అధ్వర్యంలో నిర్వహించిన రియాక్ట్‌ (రియల్‌ టైమ్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

Published : 24 Jun 2021 14:34 IST

 ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ సర్వేలో వెల్లడి

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ అధ్వర్యంలో నిర్వహించిన రియాక్ట్‌ (రియల్‌ టైమ్‌ అసెస్‌మెంట్‌ ఆఫ్‌ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌) సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో మూడో వంతు మందికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు దాదాపు 12 వారాల పాటు ఉన్నట్లు తేలింది. దాదాపు 5 లక్షల మందిని సర్వే చేయగా.. లభించిన సమాచారాన్ని బట్టి ఇంగ్లాండ్‌లో కనీసం 20 లక్షల మంది దీర్ఘకాల కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు అంచనాకు వచ్చారు. కరోనాలో ఇదే అసలు సమస్య అని పరిశోధకులు వెల్లడించారు. దీర్ఘకాల కరోనాపై పరిశోధనలకు 50 మిలియన్‌ పౌండ్లను అక్కడి ప్రభుత్వం కేటాయించింది. 

దీర్ఘకాల కొవిడ్‌కు సరైన నిర్వచనం కూడా లేదు. దీనిపై ఇప్పుడిప్పుడే పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొలుత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చి తగ్గిన తర్వాత కూడా చాలా లక్షణాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అలసట, దగ్గు, ఛాతినొప్పి, తలనొప్పి,కండరాల నొప్పులు వంటివి ఉంటున్నాయి. ఈ సర్వేను సెప్టెంబర్‌ 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య నిర్వహించారు. ఇందులో కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిని ఎంపిక చేసుకుని 29 లక్షణాలపై ప్రశ్నించారు. 

* వీరిలో 37శాతం మంది 12 వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కనీసం ఒక లక్షణం కొనసాగిందని తెలిపారు. 

* 15 శాతం మందిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు 12 వారాలకు పైగా కొనసాగాయి.

* మహిళలు, వృద్ధుల్లో దీర్ఘకాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

* అధిక బరువు, పొగతాగే అలవాటు, పేదరికం, మొండి వ్యాధులు గలవారు, ఆసుపత్రి పాలైనవారిలో ఈ లక్షణాలు దీర్ఘకాలంపాటు ఉన్నాయి. 

* అత్యధిక మందిలో అలసట కనిపిస్తోంది. ఇక ఆసుపత్రి పాలైనవారిలో మాత్రం శ్వాస సమస్యలు అధికంగా ఉన్నాయి.

ఈ సర్వేపై ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ ప్రొఫెసర్‌ పాల్‌ ఇలియాట్‌ మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలుస్తోందన్నారు. దీర్ఘకాల కొవిడ్‌పై అవగాహన తక్కువగా ఉందని.. తమ పరిశోధనతో చికిత్సకు కొంత ఉపయోగపడవచ్చని పేర్కొన్నారు. 
ఇక యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌, కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌లు నిర్వహించిన మరో సర్వేలో కొవిడ్‌ వచ్చి తగ్గిన మధ్య వయస్కుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరికి దీర్ఘకాల లక్షణాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని