
Vishal garg: ఇబ్బందుల్లో విశాల్ గార్గ్!
ఇంటర్నెట్ డెస్క్: తన కంపెనీలో పనిచేస్తోన్న 900 మంది ఉద్యోగుల్ని అకస్మాత్తుగా విధుల నుంచి తప్పించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఇబ్బందుల్లో పడ్డారు. తను తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సంస్థలోని పలువురు ఉన్నతాధికారులు రాజీనామాలు చేస్తున్నారట. దిద్దుబాటు చర్యలు కూడా పనిచేయకపోవడంతో విశాల్‌కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
అమెరికాకు చెందిన ప్రముఖ గృహ రుణాలు, తనఖా సంస్థ బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్.. ఇటీవల జూమ్ కాల్లో 900 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల సమర్థత, పనితీరు తదితర కారణాలతోనే వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు విశాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉద్యోగుల్ని అలా.. ఎలా తొలగిస్తారంటూ నెటిజన్లు సంస్థపై మండిపడుతున్నారు. విశాల్ దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండాపోయింది.
ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు విశాల్ మెయిల్స్ పంపారు. ఉద్యోగులను తప్పించడంలో తప్పుడు విధానం అవలంబించానని.. తన పొరపాటును మన్నించాలని కోరాడు. అయినా కంపెనీలో ఉన్న ఉన్నతాధికారులు విశాల్ చర్యకు నిరసనగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంస్థ పబ్లిక్ రిలేషన్ హెడ్, మార్కెటింగ్ హెడ్, కమ్యూనికేషన్స్ విభాగం ఉపాధ్యక్షుడు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరికొంత మంది రాజీనామా చేయనున్నట్లు పలు అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి.
విశాల్ గార్గ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త హర్ష గోయెంకా కూడా తప్పుపట్టారు. ‘విశాల్ గార్గ్ జూమ్ వేదికగా ఒకేసారి తొలగించిన 900 మంది గురించే నేను ఆలోచిస్తున్నాను. ఇది పూర్తిగా తప్పుడు నిర్ణయం. ఈ తొలగింపుపై వ్యక్తిగతంగా వారికే చెప్పాలి. అలాగే క్రిస్మస్కు ముందు, ఇటీవలే 750 మిలియన్ డాలర్లు సమీకరించిన సమయంలో ఈ చర్య సరైంది కాదు. ఈ తీరుతోనే కార్పొరేట్లు హృదయం లేని వారనే ముద్ర వేయించుకునేది..!’ అని గోయెంకా ట్వీట్ చేశారు.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.