నావల్నీకి జైలు శిక్ష.. భగ్గుమన్న రష్యా!

రష్యాలో ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘింనిన నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని తెలిపింది.........

Updated : 03 Feb 2021 12:09 IST

తీర్పుని ఖండించిన పాశ్చాత్య దేశాలు

మాస్కో: రష్యాలో ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీకి మాస్కో కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతులను ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ శిక్ష విధిస్తున్నామని తెలిపింది. అలెక్సీ నావల్నీపై గత ఆగస్టులో స్వదేశంలోనే విష ప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. జర్మనీలో దాదాపు ఐదు నెలలు చికిత్స పొందిన అనంతరం జనవరి 17న రష్యా చేరుకున్నారు. పోలీసులు ఆయన్ని విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలన్నీ అధికార పార్టీ కల్పితాలని నావల్నీ ఆరోపించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. అధ్యక్షుడు పుతిన్‌ను ‘లోదుస్తుల్లో విషం పెట్టే వ్యక్తి’గా అభివర్ణించారు. తనపై విషప్రయోగం పుతిన్‌ కుట్రేనని ఆరోపించారు. కోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా తాము అప్పీలు చేస్తామని నావల్నీ తరఫు న్యాయవాది తెలిపారు.

నావల్నీకి మద్దతుగా రాజధాని మాస్కో సహా రష్యావ్యాప్తంగా లక్షలాది మంది నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు, భద్రతా బలగాలకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు వేలాది మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. నావల్నీకి శిక్ష విధించటం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాస్కో కోర్టు తీర్పుతో  విశ్వసనీయత ఓడిందని ఐరోపా ఖండంలో ప్రధాన మానవ హక్కుల సంస్థ ‘కౌన్సిల్ ఆఫ్ యూరప్’ అభిప్రాయపడింది. ఈ తీర్పుని అత్యంత ఘోరమైనదిగా బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ అభివర్ణించారు. పౌరుల స్వేచ్ఛకు, చట్టబద్ధమైన పాలనకు ఈ తీర్పు వ్యతిరేకంగా ఉందని జర్మనీ విదేశాంగ మంత్రి హీకో మాస్ వ్యాఖ్యానించారు. నావల్నీని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ డిమాండ్ చేశారు. రష్యా తన పౌరుల హక్కులను కాపాడటంలో విఫలమైందంటూ.. ఈ విషయంలో ఆ దేశాన్ని బాధ్యురాలిని చేయటానికి మిత్రదేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు.

ఇవీ చదవండి..

డేనియల్‌ పెర్ల్‌ హత్య కేసు ప్రధాన నిందితుడికి జైలు నుంచి స్వేచ్ఛ

అవి సమాజ వ్యతిరేక నేరాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని