Flight: రష్యా-గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు..

మాస్కో-గోవా విమానానికి మరోసారి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టిస్తోంది. విమానంలో 240 మంది ప్రయాణికులున్నారు.

Updated : 21 Jan 2023 11:38 IST

పనాజీ: రష్యా (Russia) నుంచి గోవా (Goa) బయల్దేరిన ఓ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని (Flight) దారిమళ్లించినట్లు గోవా పోలీసులు తెలిపారు. 240 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి బయల్దేరిన అజుర్‌ ఎయిర్‌ విమానం షెడ్యూల్‌ ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.15 గంటలకు దక్షిణ గోవాలోని డబోలిమ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అవ్వాల్సి ఉంది. అయితే ఈ విమానం భారత గగనతలంలోకి రాకముందే బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది.

అజుర్‌ ఎయిర్‌ విమానంలో బాంబు ఉన్నట్లు ఈ తెల్లవారుజామున డబోలిమ్‌ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది అధికారులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికి విమానం ఇంకా భారత గగనతలంలోకి రాకపోవడంతో విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రెండు వారాల క్రితం కూడా మాస్కో నుంచి గోవా వచ్చిన ఓ అజుర్‌ ఎయిర్‌ విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) రావడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించేసి తనిఖీలు చేపట్టారు. అయితే, ఆ తర్వాత అది ఉత్తుత్తి బెదిరింపేనని తేలడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని