Supreme Court: ప్రేమ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

విడాకుల కేసులు ఎక్కువగా ప్రేమ వివాహాల్లో(Love Marriages)నే కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యానించింది. ఓ బదిలీ పిటిషన్‌ను విచారించిన సందర్భంగా ఈ విధంగా స్పందించింది.

Published : 17 May 2023 19:55 IST

దిల్లీ: ప్రేమ వివాహాల(Love Marriages)పై బుధవారం సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. చాలామటుకు విడాకులు ఈ తరహా వివాహాల్లోనే కనిపిస్తున్నాయని పేర్కొంది. ఓ జంట మధ్య మనస్పర్థలకు సంబంధించిన పిటిషన్ బదిలీపై విచారిస్తోన్న సందర్భంలో కోర్టు ఈ విధంగా స్పందించింది. ఈ కేసులో వాదనలను వినిపించిన న్యాయవాది ఆ జంటది ప్రేమ వివాహం అని కోర్టుకు వెల్లడించారు. అప్పుడు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం.. ‘ప్రేమ వివాహాల్లోనే విడాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసును మధ్యవర్తిత్వానికి ప్రతిపాదించింది.

ఇటీవల విడాకుల (Divorce) మంజూరు అంశంపై అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ‘‘దంపతుల మధ్య వివాహ బంధం (Marriage) కోలుకోలేని విధంగా విచ్ఛిన్నమైతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం ఈ కోర్టుకు సాధ్యమే. ఆర్టికల్‌ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు (Supreme Court) వారికి విడాకులు మంజూరు చేయొచ్చు. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటే.. అందు కోసం ఆరు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తివేయొచ్చు’’ అని ధర్మాసనం వెల్లడించింది. 

పరస్పరం ఇష్టపూర్వకంగా విడాకులు కోరుకునే వారి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 పరిధిలోని విస్తృత అధికారాలను వినియోగించుకునే వీలుందా అనే  దానిపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపి, పైవిధంగా స్పందించింది. ప్రస్తుత కేసులో ఈ తీర్పును అమలు చేసే అవకాశం ఉన్పప్పటికీ, కోర్టు మాత్రం మధ్యవర్తిత్వానికే మొగ్గుచూసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు