Corona: చిన్నారుల చికిత్సకు ఆ మందులు వద్దు

కరోనా చికిత్సకు సూచించిన ఐవర్‌ మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఫేవిపిరవిర్‌, యాంటీ బయోటిక్స్‌ వంటివి చిన్నారుల చికిత్సకు సిఫార్సు చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది.

Published : 16 Jun 2021 19:58 IST

నూతన మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ

దిల్లీ: కరోనా చికిత్సకు సూచించిన ఐవర్‌ మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఫేవిపిరవిర్‌, యాంటీ బయోటిక్స్‌ వంటివి చిన్నారుల చికిత్సకు సిఫార్సు చేయలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో చిన్నారుల కొవిడ్‌ కేర్‌ కోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. తీవ్రమైన కరోనాతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈ సిఫార్సుల్లో తెలిపారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ అందించాలన్న యోచనలో ఉన్న కేంద్రం దాని అనంతర చర్యల కోసం పలు సూచనలు చేసింది. తీవ్ర అనారోగ్యాలున్న చిన్నారులతో పాటు, పేదలకు టీకాలో మొదటి ప్రాధాన్యత నివ్వాలని సూచించింది.

అప్రమత్తత అవసరం..

లాక్‌డౌన్‌ సడలింపులు, పాఠశాలలు తిరిగి తెరవడం వంటి వాటి వల్ల చిన్నారులు వైరస్‌కు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా సెకండ్‌ వేవ్‌లో పిల్లల సంరక్షణ కోసం అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపింది. చిన్నారుల్లో నమోదయ్యే కరోనా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే చిన్నారుల కోసం ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని అందించాలని కేంద్రం ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది.

తల్లిదండ్రుల సంరక్షణలోనే..

చిన్నారుల్లో తక్కువ లక్షణాలుంటే వారు తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండొచ్చని కేంద్రం తెలిపింది. చికిత్స కోసం పారాసిటమాల్‌ను వాడాలని సూచించింది. శ్వాసక్రియ రేటు, ఆక్సిజన్‌ స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపింది. తల్లిదండ్రులకు స్థానిక ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో ఉండాలని ఆరోగ్య శాఖ పేర్కొంది. వీలైనంత వరకు టెలీమెడిసిన్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో వైరస్‌ వ్యాప్తి, తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న చిన్నారుల్లో ఎంఐఎస్‌-సీ పెరుగుతుండటంతో దానిపై పరిశోధనలు జరగాలని కేంద్రం పేర్కొంది. చిన్నారుల్లో కరోనాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలని ఆరోగ్యశాఖ సిఫార్సు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని