Amit Shah: మొఘల్‌ పాలకులకే చరిత్రకారుల ప్రాధాన్యం.. గొప్ప పాలకులను విస్మరించారు: షా

భారత్‌లో ఎక్కువమంది చరిత్రకారులు మొఘల్‌ పాలకుల చరిత్రను లిఖించడానికే ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.

Published : 11 Jun 2022 01:55 IST

దిల్లీ: భారత్‌లో ఎక్కువమంది చరిత్రకారులు మొఘల్‌ పాలకుల చరిత్రను లిఖించడానికే ప్రాధాన్యం ఇచ్చారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. పాండ్యులు, చోళులు, మౌర్యులు, గుప్తులతోపాటు అహోం వంటి అనేక అద్భుతమైన సామ్రాజ్యాలను విస్మరించారని అన్నారు. ప్రస్తుతం దేశ కీర్తి పెరగడంతోపాటు యావత్‌ ప్రపంచం ముందు భారత్‌ తన ఔన్నత్యాన్ని చాటుకుంటోందన్న ఆయన.. సంప్రదాయం, భాష, మతాల రక్షణ కోసం వెయ్యి సంవత్సరాలుగా చేసిన పోరాటం వృథా కాలేదన్నారు. ‘మహారాణా: వెయ్యేళ్ల ధర్మ యుద్ధం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్‌ షా ఈవిధంగా వ్యాఖ్యానించారు.

‘చరిత్రకారులకు ఓ విషయం చెప్పదలచుకున్నా. ఎంతో మంది రాజులు మనల్ని పాలించారు. కానీ, చరిత్రకారులు మాత్రం కేవలం మొఘల్‌ సామ్రాజ్యంపైనే శ్రద్ధ పెట్టి వారి గురించే ఎక్కువగా రాశారు. దాదాపు 800 ఏళ్లపాటు పాండ్యుల సామ్రాజ్యం కొనసాగింది. అస్సాంను అహోం రాజులు 650 ఏళ్లు పాలించారు. ఔరంగజేబ్‌, బఖ్తియార్‌ ఖల్జీ వంటి పాలకులను ఓడించి అస్సాంను వారు స్వతంత్ర రాజ్యంగా నిలబెట్టారు. పల్లవులు 600ఏళ్లు, చోళుల పాలన 600ఏళ్లు కొనసాగింది. అఫ్గానిస్థాన్‌ నుంచి శ్రీలంక వరకు మౌర్యులు 550 ఏళ్లు పాలించారు. శాతావాహనులు ఐదు వందల సంవత్సరాలు పాలించారు. గుప్తులు 400 ఏళ్లు పాలించడంతోపాటు సముద్రగుప్తుడు అఖండ భారత్‌ను ఊహించి దేశం మొత్తం పాలించారు. కానీ, వారిపైనా ఎలాంటి పుస్తకాలు రాలేదు’ అని కేంద్ర మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ సామ్రాజ్యాల గురించి పుస్తకాలు రాయాల్సి ఉందన్న ఆయన.. ఒకవేళ అవి అందుబాటులోకి వస్తే వాస్తవాలు బయటపడుతాయని అన్నారు. ఇందుకోసం చాలా మంది కృషి చేయాల్సిన అవసరం అందని అమిత్‌ షా అభిప్రాయపడ్డారు.

‘ఏదేమైనా.. కామెంట్లను పక్కనబెట్టి ఘనమైన చరిత్రను ప్రజల ముందుకు తీసుకురావాల్సి ఉంది. ఇందుకోసం తీవ్ర కృషి చేసినప్పుడే అబద్ధపు ప్రచారాలు మసకబారిపోతాయి. అందుకే మన ప్రయత్నాలను ముమ్మరం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలి. మనం ఇప్పుడు స్వతంత్రులం. మన చరిత్ర మనమే రాసుకోగలం. వాస్తవాలను రాయడంతో మనల్ని ఎవరూ అడ్డుకోలేరు’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. ప్రభుత్వం, పుస్తకాల ఆధారంగా చరిత్ర స్పష్టీకరణ జరగదని.. కేవలం వాస్తవ సంఘటనల ఆధారంగానే చరిత్ర లిఖితమవుతుందని కేంద్ర హోం మంత్రి ఉద్ఘాటించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts