Omicron: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్‌కేసులు.. ప్రధాని మోదీ రేపు కీలక సమీక్ష!

దేశంలో ఒమిక్రాన్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా 15రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 215 కేసులు నమోదయ్యాయి. ......

Updated : 22 Dec 2021 15:11 IST

దిల్లీ: దేశంలో ఒమిక్రాన్‌ రోజురోజుకీ విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా 15రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 215 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈరోజు ఉదయం వరకు దిల్లీలో అత్యధికంగా 57 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర 54, తెలంగాణ 24, కర్ణాటక 19, రాజస్థాన్‌ 18, కేరళ 15, గుజరాత్‌లలో 14 కేసులు నమోదయ్యాయి. అలాగే, జమ్మూకశ్మీర్‌లో మూడు కేసులు రాగా.. ఒడిశా, యూపీలలో రెండు చొప్పున కేసులు వచ్చాయి. ఏపీ, చండీగఢ్‌, లద్దాఖ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా తాజాగా తెలుగు రాష్ట్రాల్లో చెరో కేసు చొప్పున నమోదు కావడం గమనార్హం.

రాష్ట్రాల్ని అప్రమత్తం చేసిన కేంద్రం

మరోవైపు, ఒమిక్రాన్‌పై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. డెల్టా రకం కంటే కొత్త వేరియంట్‌కు 3 రెట్లు ఎక్కువ సాంక్రమిక శక్తి ఉన్నట్లు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వార్‌ రూమ్‌ల (అత్యవసర కార్యకలాపాల నిర్వహణ కేంద్రాలు)ను క్రియాశీలం చేయడంతో పాటు  కేసులు ఏమాత్రం పెరిగినా జిల్లా, స్థానిక స్థాయిల్లో కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే, కొవిడ్‌ కట్టడికి వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సూచించింది. పరిస్థితులకు అనుగుణంగా రాత్రి కర్ఫ్యూ విధించడం; ప్రజలు గుమిగూడకుండా చూడటం; వివాహాలు, అంత్యక్రియలకు హాజరయ్యేవారి సంఖ్యను పరిమితం చేయడం; నిఘా, పరీక్షలు పెంచడం వంటివి చేయాలని లేఖలో పేర్కొంది. ఒమిక్రాన్‌తో పాటు డెల్టా కేసులు కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నిన్న సాయంత్రం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.

Read latest National - International News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని