Covid: చిట్టెలుక తెచ్చిన ‘కొవిడ్‌’ తంటా.. తైవాన్‌ అప్రమత్తం!

పకడ్బందీ చర్యలతో మహమ్మారి వ్యాప్తిని అరికడుతున్న తైవాన్‌లో.. నెలరోజుల తర్వాత తాజాగా ఓ పాజిటివ్‌ కేసు బయటపడింది. అయితే.. ఈ కేసు వ్యాప్తి వ్యవహారం కొవిడ్‌ సోకిన ఓ చిట్టెలుక చుట్టూ అల్లుకుని ఉండటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...

Published : 10 Dec 2021 20:36 IST

తైపీ: పకడ్బందీ చర్యలతో కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తిని అరికడుతున్న తైవాన్‌లో.. నెలరోజుల తర్వాత తాజాగా ఓ పాజిటివ్‌ కేసు బయటపడింది. అయితే.. ఈ కేసు వ్యాప్తి వ్యవహారం కొవిడ్‌ సోకిన ఓ చిట్టెలుక చుట్టూ అల్లుకుని ఉండటం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. 20 ఏళ్ల ఓ ల్యాబ్‌ వర్కర్‌ స్థానికంగా హై సెక్యూరిటీ ప్రయోగశాల ‘అకాడెమికా సినికా జెనోమిక్ రీసెర్చ్ సెంటర్‌’లో ఉద్యోగి. దేశంలోని అత్యున్నత పరిశోధనా సంస్థల్లో ఒకటైన ఇందులో.. వ్యాధికారకాలపై పరిశోధనలు, జంతువుల్లో వ్యాక్సిన్‌ సామర్థ్యాన్ని పరీక్షించడం చేస్తుంటారు. అయితే, ఇటీవల ఇందులోని కొవిడ్‌ సోకిన ఓ ల్యాబోరేటరీ చిట్టెలుక.. ఆమెను కరిచింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి చెన్ షిహ్ చుంగ్ ధ్రువీకరించారు. అయితే.. వైరస్ వ్యాప్తికి చిట్టెలుక కరవడమే కారణమా..? కాదా? నిర్ధారించేందుకు దర్యాప్తు అవసరమని ల్యాబ్‌ సీనియర్‌ అధికారి చెప్పారు. ఆమెకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు భావిస్తున్నారు. మరోవైపు ఆమెతో క్లోజ్డ్‌ కాంటాక్ట్‌గా ఉన్న 94 మందిని ఆరోగ్య అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు. తైవాన్‌లో చివరగా నవంబర్ 5న ఓ కేసు బయటపడింది. ఇదిలా ఉండగా.. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జంతువుల నుంచి మనుషులకు కొవిడ్‌ వ్యాపించే ప్రమాదం తక్కువేనని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఇదివరకు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు