Ukraine Crisis: ఉక్రెయిన్‌లో భారతీయులకు తాజా అడ్వైజరీ!

ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాలనుంచి భారత పౌరులు పశ్చిమ ప్రాంతాలవైపు వెళ్లాలని ఉక్రెయిన్‌లోని భారత్‌ రాయబార కార్యాలయం సూచించింది.

Published : 28 Feb 2022 01:15 IST

పశ్చిమప్రాంతాలకు వెళ్లాలని సూచించిన భారత ఎంబసీ

కీవ్‌: రష్యా సైన్యం చేస్తోన్న దాడులతో ఉక్రెయిన్‌ వణికిపోతోంది. ఇప్పటికే కీవ్‌ నగరంలోకి ప్రవేశించిన సేనలు, తాజాగా మరో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లోకి అడుగుపెట్టాయి. ఇదే సమయంలో ఆయా నగరాల్లో చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో పౌరులను మరోసారి అప్రమత్తం చేసిన ఉక్రెయిన్‌లోని భారత్‌ రాయబార కార్యాలయం.. పశ్చిమ ప్రాంతాలవైపు వెళ్లాలని సూచించింది. అలాంటి వారికోసం ఉక్రెయిన్‌ రైల్వే ఉచిత సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది.

‘కీవ్‌ నుంచి వెళ్లే వారికోసం ఉక్రెయిన్‌ రైల్వే అత్యవసర సేవలను మొదలుపెట్టింది. తొలుత వచ్చిన వారికి ప్రాధాన్యత క్రమంలో ఉచితంగానే వారిని తరలిస్తోంది. అవి బయలుదేరే వివరాలు ఆయా రైల్వే స్టేషన్లలో తెలుసుకోగలరు. ఉక్రెయిన్‌లో నెలకొన్న భద్రతా పరిస్థితులు, ఆంక్షల దృష్ట్యా ఘర్షణ వాతావరణం నుంచి పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలి’ అంటూ ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం మన పౌరులకు సూచించింది.

ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశీయులను తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్‌ గంగ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు విమానాల్లో 709 మంది భారతీయ విద్యార్థులు స్వదేశం చేరుకున్నారు. ఆదివారం సాయంత్రానికి మరో విమానంలో 198 మంది పౌరులు దిల్లీ చేరుకోనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని