
UN: ప్రపంచమంతా తప్పుడు దారిలో వెళ్తోంది
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పుల నిర్వహణ విషయంలో ప్రపంచమంతా తప్పుడు దారిలో వెళ్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. ఈ రెండింటి విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 21న న్యూయార్క్‌లో ప్రారంభం కానున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన తాజాగా ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘కరోనా ఉపద్రవం.. మనకు మేలుకొలుపు లాంటిది. కానీ, మనమంతా నిద్రపోతున్నామ’ని వ్యాఖ్యానించారు. 2022 ప్రథమార్థానికి ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సిన్ లక్ష్యాన్ని చేరుకునేలా.. టీకా తయారీ దేశాలు తమ ఉత్పత్తిని వేగవంతం చేయలేకపోయాయని విచారం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో మన సమష్టి వైఫల్యాన్ని ఈ మహమ్మారి ఎత్తిచూపిందన్నారు.
‘సీఓపీ26’ వాయిదా మంచిది కాదు..
వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు, వాటి కట్టడి తదితర అంశాలపై చర్చల కోసం స్కాట్లాండ్ వేదికగా నవంబరులో ‘సీఓపీ26’ పేరిట ఐరాస ఓ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే.. వైరస్ విజృంభణ, వ్యాక్సినేషన్‌లో ఆలస్యం, రవాణా ఇబ్బందుల కారణంగా దీన్ని వాయిదా వేయాలని పలువురు వాతావరణ నిపుణులు కోరుతున్నారు. వారి వాదనలను గుటెర్రస్ తోసిపుచ్చారు. ఈ సమస్యపై చర్చించడం అత్యవసరమని, వాయిదా వేయడం మంచిది కాదన్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు.. ప్రపంచంలో అతిపెద్ద కాలుష్య కారకాలైన అమెరికా, చైనా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘వాతావరణ సంబంధిత సమస్యలు, పరిష్కారాలు, అభివృద్ధి తదితర కార్యకలాపాలకు అగ్రరాజ్య ఆర్థిక సాయం అవసరం. ఉద్గారాల కట్టడికి సంబంధించిన విషయంలో చైనా నుంచి తోడ్పాటు కావాల’ని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.