Rana Couple: నవ్‌నీత్‌ రాణా దంపతులకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాక్‌ తగిలింది. ఇరువురికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ.......

Published : 24 Apr 2022 16:10 IST

ముంబయి: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులకు మరో షాక్‌ తగిలింది. శనివారం పోలీసులు వీరిని అరెస్టు చేయగా.. ఇరువురికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ బాంద్రాలోని మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. దీంతో రెండు వారాల పాటు వారు జైలు జీవితం గడపనున్నారు. మత కలహాలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారంటూ నవనీత్‌ రాణా దంపతులను ముంబయి పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఐపీసీ సెక్షన్ 153 (ఏ) కింద వీరిపై కేసులు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ నవనీత్‌ రాణా దంపతులు సవాలు విసిరారు. అయితే ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు ఎంపీ ఇంటిముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవనీత్‌ దంపతులు తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. రవి రాణా మాట్లాడుతూ.. రేపు ముంబయికి ప్రధాని మోదీ రానుండటంతో తమ నిరసనపై వెనక్కి తగ్గుతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల కారణంగా ప్రధాని పర్యటనకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే నవనీత్‌ దంపతులు విసిరిన సవాలు మత కలహాలకు దారితీసేలా ఉందంటూ ముంబయి పోలీసులు వారిని అరెస్టు చేశారు. శుక్రవారమే నోటీసులు కూడా జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు