Liquor Policy: కొత్త మద్యం విధానం.. ఆ రాష్ట్రంలో ఇక బార్‌ షాపులు బంద్‌..!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో త్వరలోనే బార్‌ షాపులు మూతబడనున్నాయి. నూతన మద్యం విధానాని (new excise policy)కి ఆ రాష్ట్ర సర్కారు ఆమోదం తెలపడమే ఇందుక్కారణం.

Updated : 20 Feb 2023 10:44 IST

భోపాల్‌: మద్యం విక్రయాలు, వినియోగంపై విమర్శలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన మద్యం విధానానికి (new excise policy) రాష్ట్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో త్వరలోనే బార్‌ (Bar) షాపులు మూతపడనున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కొత్త విధానానికి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గుతుందన్నారు.

ఈ కొత్త విధానం కింద రాష్ట్రంలో అన్ని బార్‌ షాపులు (Bar shops), అహాటాలు(మద్యం దుకాణాల వద్ద ఉండే సిట్టింగ్‌ ప్రాంతాలు) మూసివేయనున్నట్లు మంత్రి నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు. లిక్కర్‌ (liquor) షాపుల్లో మద్యం విక్రయాలు మాత్రమే కొనసాగుతాయని, కూర్చుని మద్యం తాగేందుకు అనుమతినివ్వబోమని వెల్లడించారు. ఇక, విద్యాసంస్థలు, గర్ల్స్‌ హాస్టళ్లు, ప్రార్థనా ప్రదేశాలకు 100 మీటర్లలోపు మద్యం దుకాణాలకు అనుమతి లేదన్నారు. ఇక మద్యం తాగి వాహనాలు నడిపే కేసుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేలా కొత్త విధానంలో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ‘‘రాష్ట్రంలో మద్యం వినియోగాన్ని తగ్గించడంపై ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ (Shivraj Singh Chouhan) దృష్టి సారించారు. 2010 నుంచి రాష్ట్రంలో ఒక్క కొత్త మద్యం దుకాణాన్ని తెరవలేదు. నర్మదా సేవా యాత్ర సమయంలో 64 లిక్కర్‌ దుకాణాలను మూసివేశాం’’ అని నరోత్తమ్‌ మిశ్రా తెలిపారు.

రాష్ట్రంలో మద్యం (Liquor) వినియోగానికి వ్యతిరేకంగా భాజపా (BJP) సీనియర్‌ నేత ఉమా భారతి (Uma Bharti) కొంతకాలంగా ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి మద్య నిషేధం తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్న ఆమె.. మద్యం విక్రయాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని ప్రాంతాల్లో ఆమె లిక్కర్‌ షాపులను ధ్వంసం చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే కొత్త మద్యం విధానానికి రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. కాగా.. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని