Megha Parmar: కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే.. అంబాసిడర్‌గా తొలగింపు..!

పర్వతారోహకురాలు మేఘా పార్మర్‌ (Megha Parmar)ను బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆమె కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.

Published : 19 May 2023 15:49 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని (Everest climber) అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన మేఘా పార్మర్‌ (Megha Parmar)కు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ‘బేటీ బచావో బేటీ పడావో’, రాష్ట్ర డెయిరీ బ్రాండ్‌ సాంచికి ప్రచారకర్త (ambassador)గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. పార్మర్‌ కాంగ్రెస్‌లో చేరడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మేఘా పార్మర్‌ (Megha Parmar) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మే 9న ఛింద్వాడాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ (Kamal Nath) సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ (Congress) పార్టీలో చేరారు. ఆ మరుసటి రోజే రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బేటీ బచావో బేటీ పడావోకు రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్న ఆమెను బాధ్యతల నుంచి తప్పించింది. ఇది జరిగిన కొద్ది రోజులకే తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పాల ఉత్పత్తుల బ్రాండ్‌ సాంచికి ప్రచారకర్తగా ఉన్న మేఘాను తొలగించింది. దీంతో ఇది కాస్తా విమర్శలకు దారితీసింది.

మేఘా పార్మర్‌ (Megha Parmar) కాంగ్రెస్‌లో చేరారన్న కారణంతోనే ఆమెను ప్రచారకర్తగా తొలగించారని భాజపా సర్కారుపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. ‘‘ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మేఘా.. యావత్ దేశం గర్వపడేలా చేశారు. అలాంటి వ్యక్తిని బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి నుంచి తప్పించారు. కాంగ్రెస్‌లో చేరడమే ఆమె చేసిన నేరమా?’’ పార్టీ నేత కేకే మిశ్రా.. ముఖ్యమంత్రి చౌహన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అటు తాజా పరిణామాలపై మేఘా పార్మర్‌ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేను రైతు బిడ్డను. ఎవరెస్ట్‌ను అధిరోహిస్తానని కలలో కూడా ఊహించలేదు. కానీ, మాజీ సీఎం కమల్‌నాథ్ నాకు ఎంతో సాయం చేశారు. ఆర్థికంగా అండగా నిలిచారు. అందువల్లే నేను ఎవరెస్ట్ ఎక్కగలిగాను. సినిమా హీరోయిన్లను పక్కనబెట్టి.. అప్పటి కమల్‌నాథ్‌ ప్రభుత్వం ఓ రైతు బిడ్డనైన నన్ను బేటీ బచావో- బేటీ పడావోకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు. కానీ, ఇప్పుడు భాజపా ప్రభుత్వం.. నన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించింది. భాజపా బేటీ బచావో.. ఇప్పుడు బేటీ హఠావోగా మారింది’’ అని ఆమె మండిపడ్డారు. అయితే, మేఘా, కాంగ్రెస్‌ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కాగా.. 2019 మే 22న మేఘా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. మధ్యప్రదేశ్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని