Madhya pradesh: ఫేక్‌ ఫొటో ట్వీట్‌ చేసి చిక్కుల్లో పడ్డ దిగ్విజయ్‌ సింగ్‌

ఫేక్‌ ఫొటో ట్వీట్‌ చేసి చిక్కుల్లో పడ్డారు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌. ఈ విషయమై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూస్తోంది.

Published : 13 Apr 2022 01:10 IST

భోపాల్‌ : ఫేక్‌ ఫొటో ట్వీట్‌ చేసి చిక్కుల్లో పడ్డారు మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌. ఈ విషయమై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. మంగళవారం ఉదయం దిగ్విజయ్‌ సింగ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో ఖర్గోవ్‌లో ఆదివారం జరిగిన మతపరమైన హింస సమయంలో తీసిన చిత్రం అంటూ ఒక పోస్ట్ చేశారు.  కొంతమంది యువకులు మసీదుపై కాషాయ జెండాను పెడుతున్నట్లు ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘ఆయుధాలతో ఊరేగింపునకు ఖర్గోవ్‌ అధికారులు అనుమతించారా?’ అని ట్వీట్ చేశారు. కొంతసేపటికి అది ఫేక్‌ ఫొటో అని .. బిహార్‌లో తీసిన పాత చిత్రమని తెలియడంతో ఆ పోస్ట్‌ను తొలగించారు. కానీ అది అప్పటికే వైరల్‌ అయింది.

రాష్ట్రంలో మతపరమైన ఘర్షణలకు దిగ్విజయ్ సింగ్ ఆజ్యం పోస్తున్నారని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ‘ఓ ప్రార్థనా మందిరంలో యువకుడు కాషాయ జెండాను ఎగురవేస్తున్న ఫోటోను దిగ్విజయ సింగ్ ట్వీట్ చేశారు. ఆ ఫొటోలో ఉన్నది మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తి కాదు. ఈ ట్వీట్ రాష్ట్రంలో మతపరమైన అల్లర్లకు తావిస్తుంది. ఇలాంటి కుట్రలను సహించలేం’ అంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్‌ చేశారు. మరోవైపు దిగ్విజయ్‌ ఫేక్ ట్వీట్‌పై ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి  న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని