Crime news: ఝార్ఖండ్‌ మహిళపై ఘోరం.. లోక్‌సభలో ప్రస్తావన

ఝార్ఖండ్‌లో మహిళ దారుణ హత్యోదంతం లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. గొడ్డా ఎంపీ నిషికాంత్‌ దూబే ఈ అంశాన్ని లోక్‌సభలో లేవనెత్తారు.

Published : 19 Dec 2022 23:35 IST

దిల్లీ: ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌ జిల్లా బోరియా ప్రాంతంలో ఇటీవల ఓ మహిళ దారుణ హత్యోదంతాన్ని భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే లోక్‌సభలో లేవనెత్తారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా చొరబడిన వలసదారుల అంశంతో దీన్ని ముడిపెట్టి చూడాలని కోరారు. దిల్‌దార్‌ అన్సారీ(28) అనే వ్యక్తి తన భార్య రుబికా పహాదిన్‌(22)ను చంపి  50 ముక్కలుగా నరికి జిల్లా అంతటా విసిరేసిన ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు దిల్‌దార్‌ అన్సారీతో పాటు అతడి కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ దారుణ ఘటనను ఝార్ఖండ్‌లోని గొడ్డా నియోజకవర్గం ఎంపీ నిషికాంత్‌ దూబే సోమవారం లోక్‌సభలో ప్రస్తావించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు తన నియోజకవర్గాన్ని ఆక్రమిస్తున్నారనే అంశాన్ని తాను పదే పదే లేవనెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా సభకు గుర్తు చేశారు.  ఝార్ఖండ్‌ ప్రభుత్వం మద్దతుతోనే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శించారు. తాజాగా ఆదివాసీ వర్గానికి చెందిన 22 ఏళ్ల మహిళను బలవంతంగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆమెను 50 ముక్కలుగా నరికి చంపినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ఇలాంటి ఘోరం దిల్లీ, కోల్‌కతా లేదా ముంబయి లాంటి నగరాల్లో జరిగితేనే మీడియా ప్రధానంగా వార్తలు రాస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని