MS Swaminathan: దేశ ‘వ్యవసాయం తలరాత’నే మార్చి.. 84 డాక్టరేట్లు పొంది!

వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని.. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగడం, కొత్తవారు ఆకర్షితులవడం జరుగుతుందని ఎంఎస్‌ స్వామినాథన్‌ చెబుతుంటారు. 

Published : 28 Sep 2023 15:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త (Agriculture Scientist).. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని పరితపించిన వ్యక్తి. రైతులకు గిట్టుబాటు ధర మొదలు (MSP).. వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణలకు నిరంతరం కృషిచేసిన హరిత విప్లవ (Green Revolution) పితామహుడు. వ్యవసాయ స్వయంసమృద్ధికి నిరంతరం కృషి చేస్తూ.. దేశ వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చిన కర్షక పక్షపాతి. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన డాక్టర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ (MS Swaminathan) ప్రస్థానంలోకి ఓసారి తొంగిచూస్తే..

హరిత విప్లవ పితామహుడు..

వ్యవసాయం ఆర్థికంగా లాభసాటిగా మారాల్సి ఉందని పరితపించిన ఎంఎస్‌ స్వామినాథన్‌.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసించారు. ఆధునిక పద్ధతులతో అధిక ఫలసాయం సాధ్యమని నమ్మిన ఆయన.. కొత్త వంగడాలు సృష్టించి దేశంలో వ్యవసాయం గతిని మార్చారు. రెండోప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభ పరిస్థితులు, బెంగాల్‌ కరువు ప్రజలకు శాపంగా మారింది. అధిక దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాల అభివృద్దే లక్ష్యంగా మెక్సికోలో తొలుత హరిత విప్లవానికి బీజం పడింది.

ఇలా 1960, 70దశకంలో భారత్‌లోనూ ఆహార సంక్షోభం (Food Crisis) ముప్పును ఎదుర్కొన్న సమయంలో భిన్న వ్యవసాయ పరిస్థితులను ఎదుర్కొని అధిక దిగుబడులిచ్చే పంటల అవసరం ఏర్పడింది. అప్పటికే వ్యవసాయంలో కీలక పరిశోధనలు చేస్తున్న ఎంఎస్‌ స్వామినాథన్‌.. అధిక దిగుబడులు ఇచ్చే గోధుమ, వరి రకాలను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. ఆయన చేసిన కృషి.. వాటిని ఇక్కడ అమలు చేయడం భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికింది. అనంతరం అది భారత వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చివేసింది. దేశ వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదం చేయడంతోపాటు కోట్ల మందికి ఆహార భద్రతను (Food Security) కల్పించింది.

గిట్టుబాటు ఫార్ములా..

దేశంలో ‘స్వామినాథన్‌ కమిషన్‌’ సిఫార్సులను అమలు చేయాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. రైతులకు మద్దతు ధర కోసం వ్యవసాయ పరిశోధకుడు స్వామినాథన్‌ నేతృత్వంలో ఓ ఫార్ములాను (MSP formula) రూపొందించారు. రైతుల పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 150శాతం (C2 plus 50%) దక్కేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది దీని ఉద్దేశం. రైతులు చెల్లించేసిన వ్యయాలు, కుటుంబ శ్రమ విలువ, సొంత మూలధన ఆస్తుల విలువపై వడ్డీ, భూమికి చెల్లించిన కౌలు, సొంత భూమికి కౌలు విలువ వంటి వ్యయాలన్నీ జతచేర్చి C2గా వ్యవహరించారు. వీటికి అదనంగా 50శాతం కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది ఈ ఫార్ములా (MSP formula) లక్ష్యం. రైతుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఎన్‌సీఎఫ్‌ (NCF) సిఫార్సులే తగినవని ఎంఎస్‌ స్వామినాథన్‌ చివరి శ్వాస వరకు ఉద్ఘాటించారు.

84 గౌరవ డాక్టరేట్లు..

భారత వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ చూపిన ప్రభావం దేశ సరిహద్దులు దాటింది. ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జనరల్‌తోపాటు అనేక వ్యవసాయ ఆధారిత అంతర్జాతీయ కేంద్రాలకు అధిపతిగా పని చేసిన ఆయన.. వ్యవసాయంతోపాటు పర్యావరణ సమస్యలపైనా దృష్టి సారించారు. 1960, 70ల్లో భారత వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేసిన ఆయన్ను ఐరాస పర్యావరణ కార్యక్రమం (UNEP) ‘ఫాదర్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ ఎకాలజీ’గా పేర్కొంది. ఇలా ఆయన పరిశోధనల ప్రస్థానంలో 18 పుస్తకాలు, 250 పరిశోధక పేపర్లను (2021 వరకు) రచించారు. ప్రపంచ వ్యవసాయ రంగంపై ఆయన చూపిన ప్రభావానికి గాను ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులతోపాటు దాదాపు 84 డాక్టరేట్లు ఆయన్ను వరించాయంటే స్వామినాథన్‌ ఘనతను అర్థం చేసుకోవచ్చు. ఇలా ‘టైమ్స్‌’ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతుల్లో టాప్‌ 20లోనూ ఆయన నిలిచారు.

ప్రోత్సాహం ఇస్తేనే..

వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని.. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగడం, కొత్తవారు ఆకర్షితులవడం జరుగుతుందని ఎంఎస్‌ స్వామినాథన్‌ చెబుతుంటారు. వ్యవసాయ విధానాల రూపకల్పన ప్రక్రియలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగడం లేదన్నది ఆయన అభిప్రాయం. ఇలాంటి చర్యలన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కోరుకున్నారు. రైతులకు ఆదాయం సుస్థిరత దక్కేలా చూడటం ముఖ్యమని భావించేవారు. ఇందుకోసం రైతు అనుకూల మార్కెట్‌ విధానం అవసరమనేవారు. రైతుల బాగోగుల్ని నిర్ణయించేవి రుతుపవనాలు, మార్కెట్‌లేనని డాక్టర్‌ స్వామినాథన్‌ బలంగా విశ్వసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు