ఏటా మద్దతు ధర పెరుగుతుంది: రాజ్‌నాథ్‌

మోదీ ప్రభుత్వం ఎప్పటికీ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలో పెరుగుదల ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు.

Published : 01 Oct 2020 23:01 IST

దిల్లీ: మోదీ ప్రభుత్వం ఎప్పటికీ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలో పెరుగుదల ఉంటుందని రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘ఇటీవల వ్యవసాయ బిల్లుల వ్యతిరేక నిరసనలో భాగంగా కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు ట్రాక్టర్‌ను తగలబెట్టడం ఎంతో విచారకరం. సైనికులకు ఆయుధం ఎంత పవిత్రమైనదో.. అదే విధంగా రైతులకు ట్రాక్టర్‌ పవిత్రమైనది. కాబట్టి ట్రాక్టర్‌ను తగలబెట్టడం వారిని అవమానించడమే అవుతుంది. ఒక రైతు బిడ్డగా నేను హామీ ఇస్తున్నా. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. రైతులు, రైతు సంఘాల్ని మేం కోరేది ఒకటే. మీకు ఏదైనా అనుమానం ఉంటే మాతో వచ్చి మాట్లాడండి. కొన్ని తప్పుడు ప్రచారాలపై నేను ఇప్పటికే పలు రైతుల సంఘాలతో చర్చించా. కనీస మద్దతు ధర కూడా ఎప్పటికీ ఒకేలా ఉండదు. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం పెరుగుదల ఉంటుంది’ అని రాజ్‌నాథ్‌ రైతులకు హామీ ఇచ్చారు. 

వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ యువజన కార్యకర్తలు దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద ట్రాక్టర్‌ను తగలబెట్టిన విషయం తెలిసిందే. పంజాబ్‌, హరియాణా సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని