కరోనా విలయం: ఆక్సిజన్‌ పంపిన అంబానీ

కరోనా మహమ్మారి విలయతాండవంతో మహారాష్ట్రలో విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ దాతృత్వాన్ని చాటుకున్నారు.

Published : 15 Apr 2021 16:59 IST

ముంబయి: కరోనా మహమ్మారి విలయతాండవంతో మహారాష్ట్రలో విపత్కర పరిస్థితులు నెలకొన్న వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ దాతృత్వాన్ని చాటుకున్నారు. తమ చమురు శుద్ధి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు ముందుకొచ్చారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో గల తమ చమురు శుద్ధి కేంద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు ఉచితంగా పంపిస్తున్నట్లు ఆ కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర రాష్ట్రమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కూడా ధ్రువీకరించారు. రిలయన్స్‌ నుంచి 100 టన్నుల ఆక్సిజన్‌ త్వరలో రాష్ట్రానికి చేరనున్నట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. 

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ ఉద్ధృతంగా ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అక్కడ నానాటికీ కేసులు పెరుగుతుండటంతో కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయాయి. చాలా ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ సరిపోవట్లేదని స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి 15 రోజుల జనతా కర్ఫ్యూ విధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని