ములాయం ఆరోగ్యం మరింత విషమం.. అఖిలేశ్‌కు చంద్రబాబు ఫోన్‌!

ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి ఈరోజు మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Published : 09 Oct 2022 23:06 IST

గురుగ్రామ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి ఈరోజు మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ములాయం చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి బులిటెన్‌ విడుదల చేసింది.‘‘ములాయం సింగ్‌ ఆరోగ్య పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. జీవనాధార ఔషధాలతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది’’ అని బులిటెన్‌లో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ములాయం సింగ్‌ ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన తనయుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని చంద్రబాబు ట్విటర్‌లో వెల్లడించారు. ములాయం కోసం ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో అఖిలేశ్‌ యాదవ్‌ దృఢంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ములాయం సింగ్‌ యాదవ్‌ గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని