Budget Session: ములాయం కాళ్లకు నమస్కరించిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ

బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున పార్లమెంట్‌ ఆవరణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Published : 31 Jan 2022 16:07 IST

సమాజ్‌వాదీ నేతకు తోడుగా నిలిచిన మరో మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌

దిల్లీ: బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున పార్లమెంట్‌ ఆవరణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, పార్లమెంట్‌ సభ్యుడు ములాయం సింగ్‌ను.. కేంద్ర మంత్రులు ఆప్యాయంగా పలుకరించారు. అంతేకాకుండా ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. సీనియర్‌ నేతకు సహాయం చేసేందుకు కేంద్ర మంత్రులు చూపిన చొరవను పార్లమెంట్‌ ఆవరణలో ఉన్నవారంతా ఆసక్తిగా గమనించారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం చేశారు. అది పూర్తైన తర్వాత పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ నుంచి ములాయం సింగ్‌ యాదవ్‌ బయటకు వచ్చారు. ప్రవేశద్వారం వద్ద మెట్ల మార్గంలో కిందకు దిగుతున్న సమయంలో ఆయన కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. అది గమనించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆయన దగ్గరకు వెళ్లి పలుకరించారు. అంతేకాకుండా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అదే సమయంలో మరో కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ కూడా ములాయం సింగ్‌ దగ్గరకు వెళ్లి ఆయన్ను చేతపట్టుకొని కిందకు దిగేందుకు సహకరించారు. ఆ దృశ్యాన్ని అక్కడున్న వారు ఆసక్తిగా గమనించడంతో పాటు తమ ఫోన్లలో బంధించే ప్రయత్నం చేశారు. కొద్ది సేపటి తర్వాత కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆ ప్రదేశానికి చేరుకునప్పటికీ కేంద్రమంత్రులతో ఆయన మాట కలపలేదు.

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార భాజపా, ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీల మధ్య కీలక పోటీ నెలకొంది. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల నాయకుల విమర్శలు, ఆరోపణలతో యూపీ రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఈ సందర్భంలోనే యూపీలో ప్రతిపక్షంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, భాజపా కేంద్రమంత్రుల మధ్య పార్లమెంటులో ఈ సంఘటన చోటుచేసుకోవడం ఆసక్తికరంగా మారింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు