Mulayam Singh Yadav: ఆనాడు.. ప్రధాని పీఠం తృటిలో చేజారిన వేళ..!

1996లో ములాయం సింగ్‌ యాదవ్ ప్రధానమంత్రి బాధ్యతలు దాదాపు చేపట్టేవారే. కానీ సంకీర్ణ రాజకీయాల కారణంగా ఆ అవకాశం చేజారింది.

Updated : 10 Oct 2022 14:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దాదాపు ఆరు దశాబ్దాల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ములాయం సింగ్‌ యాదవ్‌కు ఓసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం అత్యంత దగ్గరగా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకు ప్రధాని పీఠం తృటిలో దూరమైంది. ఆ  సందర్భంలో పీఎం రేసులో ములాయం ముందంజలో ఉన్నప్పటికీ.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్‌ యాదవ్‌ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆయన ప్రధాని కాలేకపోయారు.

1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. హస్తం పార్టీకి 141 సీట్లు రాగా.. 161 సీట్లతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అటల్ బిహారీ వాజ్‌పేయీకి ఆహ్వానం రావడంతో ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే వాజ్‌పేయీ ప్రభుత్వం 13 రోజులకే కుప్పకూలింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ ఆసక్తి కనబర్చలేదు.

గతంలో 1989లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వీపీ సింగ్‌పై అందరి దృష్టి పడింది. అయితే ప్రధాని పదవి చేపట్టేందుకు నిరాకరించిన ఆయన‌.. అప్పటి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతి బసు పేరును ప్రతిపాదించారు. కానీ, వీపీ సింగ్‌ ఆఫర్‌ను సీపీఎం పొలిట్‌బ్యూరో తిరస్కరించింది. ఈ క్రమంలోనే ములాయం సింగ్‌ యాదవ్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా.. అప్పటికే దాణా కుంభకోణం కేసులో లాలూపై అభియోగాలు రావడంతో ప్రధాని రేసు నుంచి ఆయనను పక్కనబెట్టారు.

ఆ తర్వాత, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను వామపక్ష కీలక నేత హరికిషన్‌ సింగ్‌ సుర్జిత్‌కు అప్పగించారు. పార్టీలను కూడగట్టడంలో సఫలమైన సుర్జిత్‌.. ప్రధాని పదవికి ములాయం పేరును సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను లాలూ ప్రసాద్‌ యాదవ్‌, శరద్‌ యాదవ్‌ వ్యతిరేకించారు. దీంతో ‘నేతాజీ’ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. అనంతరం దేవెగౌడ నేతృత్వంలో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు