Gen Manoj Pande: మన ముందు అనేక సవాళ్లు.. ఆర్మీ నూతన చీఫ్‌ జనరల్‌ పాండే

సమకాలీన, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ సంసిద్ధతలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను నిర్ధారించడం తన ప్రాధాన్య అంశమని ఆర్మీ నూతన చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ...

Published : 01 May 2022 13:50 IST

దిల్లీ: సమకాలీన, భవిష్యత్తు భద్రతా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు కార్యాచరణ సంసిద్ధతలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను నిర్ధారించడం తన ప్రాధాన్య అంశమని ఆర్మీ నూతన చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని.. ఫలితంగా మన ముందు అనేక సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో వైమానిక, నావికాదళాల సమన్వయం, సహకారంతో ఎటువంటి పరిస్థితులనైనా ఐక్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆదివారం సౌత్ బ్లాక్ లాన్స్‌లో సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రక్షణ రంగంలో స్వావలంబనతోపాటు మెరుగైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కొనసాగుతున్న సంస్కరణలు, పునర్నిర్మాణం, పరివర్తనపైనా దృష్టి సారిస్తానని తెలిపారు.

సైన్యం ఆధునికీకరణ ప్రక్రియలో కొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు చర్యలు తీసుకుంటానని జనరల్‌ పాండే చెప్పారు. దేశ నిర్మాణానికి దోహదపడేందుకు సైన్యం ఇతర సేవాకార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటుందని అన్నారు. ఇదివరకటి అధికారుల మంచి పనులను మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. సైనికులు, సైన్యాధికారుల సంక్షేమానికి భరోసా ఇస్తున్నానన్నారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరి, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. జనరల్ ఎంఎం నరవణె పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జనరల్ పాండే శనివారం 29వ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇదివరకు వైస్ చీఫ్‌గా పనిచేసిన ఆయన.. ‘కోర్‌ ఆఫ్ ఇంజినీర్స్’ నుంచి సైన్యం పగ్గాలు చేపట్టిన మొట్టమొదటి అధికారి అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని