Mumbai airport: ముంబయి ఎయిర్‌పోర్టుకు ఉగ్ర బెదిరింపులు

ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉగ్ర బెదిరింపులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో ప్రధాని పర్యటన ఉన్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో ఏజెన్సీలు అప్రమత్తం అయ్యాయి. 

Published : 07 Feb 2023 16:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి(Mumbai)లో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి(Mumbai airport) ఇండియన్‌ ముజాహిద్దీన్‌ పేరిట ఉగ్ర బెదిరింపులు వచ్చాయి. దీంతో విమానాశ్రయంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. సోమవారం ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. కాల్‌ చేసిన వ్యక్తి తాను ఇండియాన్‌ ముజాహిద్దీన్‌లోని సభ్యుడు ఇర్ఫాన్‌ అహ్మద్‌ షేక్‌గా చెప్పుకొన్నాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకొంది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ పోర్టు అధికారులు ముంబయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విమానాశ్రయ ఏజెన్సీలతోపాటు ముంబయి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును మొదలుపెట్టారు. 

ఈ నెల 10వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ ఒక రోజు పర్యటన నిమిత్తం ముంబయి(Mumbai)కి రానున్నారు. దీంతో సోమవారం నుంచే భద్రతా ఏర్పాట్లు మొదలుపెట్టారు. ముంబయి విమానాశ్రయ ప్రాంతంలో డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు. ప్రధాని ఈ పర్యటనలో దావుదీ బొహ్రా కమ్యూనిటీకి చెందిన అరబిక్‌ అకాడమీని ఆయన ప్రారంభించనున్నారు. దీంతోపాటు కొలాబాలోని నావికాదళ స్థావరాన్ని కూడా సందర్శించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ముంబయి విమానాశ్రయానికి ఉగ్ర బెదరింపులు రావడంతో భద్రతా ఏజెన్సీలను ఉలిక్కిపడేలా చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని