Mumbai Hit and Run: మహిళపై కారుతో దూసుకెళ్లి.. గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో నక్కి: శివసేన యువనేతపై లుక్‌ఔట్‌ నోటీసు

Mumbai Hit and Run case: ఓ మహిళ మృతికి కారణమైన ముంబయి హిట్‌ రన్‌ కేసులో ప్రధాన నిందితుడు శివసేన యువనేతపై పోలీసులు లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. అతడి కోసం 6 బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.

Published : 08 Jul 2024 11:57 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో శివసేన (Shiv Sena) నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన (Mumbai Hit and Run case) తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు, శివసేన యువనేత మిహిర్‌ షా కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా.. ఘటన తర్వాత నిందితుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ ఇంట్లో దాక్కొన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ (Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించగా.. ఆమె భర్త గాయపడ్డారు. అయితే, ప్రమాదం తర్వాత మిహిర్‌ ఘటనకు కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి వెళ్లిపోయారు. నేరుగా తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి అక్కడ కొంతసేపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడు పరారైనట్లు నిర్ధారించారు. నిందితుడి గర్ల్‌ఫ్రెండ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

మద్యం మత్తులో కారు నడిపి.. మహిళ ఉసురు తీసిన శివసేన యువనేత

లుక్‌ఔట్‌ నోటీసు జారీ..

మిహిర్‌ దేశం విడిచి వెళ్లిపోయే అవకాశముందని అనుమానించిన పోలీసులు అతడిపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. నిందితుడి కోసం ఆరు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం (Mumbai Hit and Run Case) జరగడానికి కొన్ని గంటల ముందు మిహిర్‌ జుహూ ప్రాంతంలోని ఓ బార్‌లో మద్యం తాగినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. ఆ బార్‌లో నిందితుడు రూ.18వేల బిల్లు చేసినట్లు తెలిపారు.

ప్రమాద సమయంలో కారులో మిహిర్‌తో పాటు అతడి డ్రైవర్‌ కూడా ఉన్నాడు. బార్‌ నుంచి ఇంటికి వెళ్తూ కారు తానే నడుపుతానని పట్టుబట్టి నిందితుడు డ్రైవర్‌ సీట్లోకి మారినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే మిహిర్‌ తండ్రి రాజేశ్‌ షా, డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని