Published : 01 Jun 2022 20:12 IST

Corona: ముంబయిలో కరోనా ఉద్ధృతి.. కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయ్‌..!

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. గత కొన్ని వారాలుగా ఈ వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. నిన్న 506 మందికి వైరస్‌ సోకగా.. తాజాగా మరో 739 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతో ముంబయి మహానగరంలో కరోనా పాజిటివిటీ రేటు 8.4 శాతంగా నమోదైంది. ఫిబ్రవరి 1 తర్వాత ఇంత భారీ సంఖ్యలో కొత్త కేసులు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బృహాన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నగరంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 8,792 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 739 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా 295 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. మరోవైపు, ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారవిలో 10 కొత్త కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. కొత్త కేసులతో కలిపితే అక్కడ యాక్టివ్‌ కేసుల సంఖ్య 37కి పెరిగింది. మే 15 వరకు ఈ మురికివాడలో జీరో కేసులే ఉన్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటం గమనార్హం. కరోనా మొదలైనప్పట్నుంచి ధారవిలో ఇప్పటివరకు మొత్తంగా 8,707  కేసులు నమోదు కాగా... వారిలో 8,252మంది కోలుకున్నారు. 419 మంది మృతిచెందారు.

మే నెల ప్రారంభం నుంచి ముంబయిలో క్రమంగా కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి 6 తర్వాత తొలిసారి మంగళవారం 500 మార్కును దాటగా.. తాజాగా ఆ సంఖ్య 700 మార్కును దాటేసింది. ‘ముంబయిలో రోజువారీ కొవిడ్‌ కేసులు గణనీయంగా పెరిగాయి. ఓ వైపు రుతుపవనాలు సమీపిస్తున్నందున.. లక్షణాలున్న కేసుల్లో పెరుగుదల వేగంగా కనిపిస్తోంది’ అని బీఎంసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 12 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలను విస్తృతంగా పంపిణీ చేయడంతోపాటు బూస్టర్‌ డోసు పంపిణీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య భారీగా పెరగవచ్చనే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆస్పత్రులకు సూచించింది. పలు ప్రైవేటు ఆస్పత్రులను సైతం అప్రమత్తం చేసింది. కొన్ని వారాలుగా నగరంలో కేసులు పెరుగుతుండటంతో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశామని, పెద్ద సంఖ్యలో పరీక్షలు చేయాలని ఆదేశించినట్టు బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ తెలిపారు.

ముంబయిలో ఇప్పటివరకు మొత్తంగా 1,71,45,476 కొవిడ్ పరీక్షలు చేయగా.. 10,66,541 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 10,44,005 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 19,566 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ముంబయి నగరంలో 2,970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని