Hit And Run: ముంబయి హిట్‌ అండ్‌ రన్ కేసు.. పబ్‌ పైకి బుల్డోజర్‌

ముంబయి హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నిందితుడు మద్యం తాగిన వైస్-గ్లోబల్ తపస్ బార్‌ను బుధవారం ఎక్సైజ్‌ అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు.

Updated : 10 Jul 2024 15:56 IST

ముంబయి: ముంబయిలో శివసేన(Shiv Sena) నేత రాజేశ్‌ షా కుమారుడు మిహిర్‌ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.  నిందితుడు మిహిర్ షా(24) మద్యం తాగిన వైస్-గ్లోబల్ తపస్ బార్‌లోని కొంత భాగాన్ని బుధవారం ఎక్సైజ్‌ అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. బార్‌ను సీజ్‌ చేసిన ఒకరోజు అనంతరం అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.   ప్రభుత్వ నియమాలు పాటించకుండా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న యువతీ, యువకులకు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో బార్‌ను కూల్చివేసినట్లుగా వారు పేర్కొన్నారు. బార్‌ యజమానుల వద్ద సరైన లైసెన్సులు కూడా లేవన్నారు.

ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్‌ (Mihir Shah) మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో మహిళ మృతి చెందగా.. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడికి సహకరించిన కొందరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నిందితుడి తండ్రి రాజేశ్‌ షా కూడా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే ఆదేశాలతో దర్యాప్తును వేగవంతం చేశారు. అతడి ఆచూకీ కోసం 11 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్‌ షాను పోలీసులు అరెస్టు చేశారు. 

శివసేన నుంచి రాజేశ్‌ షా తొలగింపు

హిట్‌ అండ్‌ రన్‌ కేసు నిందితుడు మిహిర్‌ షా తండ్రి రాజేశ్‌ షాను పార్టీకి చెందిన అన్ని పదవుల నుంచి తొలగించినట్లుగా శివసేన వర్గాలు బుధవారం వెల్లడించాయి. పాల్ఘర్‌లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా హిట్‌ అండ్‌ రన్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని