Mumbai: ఆస్పత్రుల్లో చేరికలు తక్కువే.. ఇప్పట్లో లాక్‌డౌన్‌ అవసరం లేదు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసులు రెండు రోజులుగా 20 వేలు దాటుతోన్న విషయం తెలిసిందే. అయితే, స్థానికంగా రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు మించితే లాక్‌డౌన్‌ విధింపు అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవల నగర మేయర్‌ కిశోరి పెడ్నేకర్ ప్రకటించారు...

Published : 08 Jan 2022 18:27 IST

ముంబయి మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌

ముంబయి: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా కేసులు రెండు రోజులుగా 20 వేలు దాటుతోన్న విషయం తెలిసిందే. అయితే, స్థానికంగా రోజువారీ కేసుల సంఖ్య 20 వేలు మించితే లాక్‌డౌన్‌ విధింపు అంశాన్ని పరిశీలిస్తామని ఇటీవల నగర మేయర్‌ కిశోరి పెడ్నేకర్ ప్రకటించారు. ఇదే విషయమై మేయర్‌ శనివారం మరోసారి మాట్లాడుతూ.. మహమ్మారి బారిన పడి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం లేదని చెప్పారు. శనివారం బాంద్రా-కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) వద్ద ఉన్న కొవిడ్‌ జంబో కేంద్రాన్ని సందర్శించిన మేయర్‌.. అక్కడ చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈ కేంద్రంలోని 2500 పడకల్లో 1600 ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 

రోగుల్లోనూ 670 మంది లక్షణాలు లేనివారేనని, ప్రస్తుతం ఒక్కరు కూడా ఐసీయూ బెడ్‌పై లేరని వెల్లడించారు. ‘నగరంలో రోజువారీ కేసులు 20 వేలు దాటుతోన్నా.. 17 వేల కంటే ఎక్కువ మంది లక్షణాలు లేనివారే. నగరంలో అందుబాటులో ఉన్న మొత్తం పడకల్లో 80 శాతం కంటే ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్‌ల డిమాండ్ కూడా చాలా తక్కువగా ఉంది’ అని చెప్పారు. ‘కొత్త వేరియంట్‌ సంక్రమణ రేటు ఎక్కువగా ఉంది. కానీ, లక్షణాలు తేలికపాటిగా ఉన్నందున భయాందోళనలు అవసరం లేదు. పరిస్థితి నియంత్రణలోనే ఉంది. అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులంతా జాగ్రత్తగా ఉండాలి. మాస్కు తప్పనిసరిగా ధరించాలి’ అని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు