Mumbai: ముంబయిలో మరిన్ని ఆంక్షలు.. సాయంత్రం 5 తర్వాత ఆ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు..!

మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని ముంబయిలో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. బీచ్‌లు, మైదానాలు, పార్క్‌లు,

Updated : 31 Dec 2021 15:39 IST

ముంబయి: మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజధాని ముంబయిలో మరిన్ని ఆంక్షలు తీసుకొచ్చింది. బీచ్‌లు, మైదానాలు, పార్క్‌లు, ఉద్యానవనాల వంటి పబ్లిక్‌ ప్లేస్‌లకు సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్లకుండా నిషేధం విధించింది. ఈ ఆంక్షలు నేటి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి.. జనవరి 15 వరకు అమల్లో ఉంటాయని ముంబయి పోలీసులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

‘‘గత కొన్ని రోజులుగా ముంబయిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వ్యాప్తి, కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందువల్ల ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని నిషేధాజ్ఞాలు జారీ చేస్తున్నాం. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు గానూ ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడంపై నిషేధం విధిస్తున్నాం. ఈ సమయాల్లో పార్క్‌లు, బీచ్‌లు, మైదానాలు, నడకదారులు(ప్రత్యేకంగా వాకింగ్‌ చేసుకునేందుకు ఏర్పాటు చేసేవి), సముద్ర తీరం వంటి ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు’’ అని ముంబయి పోలీసులు వెల్లడించారు. నూతన సంవత్సరం రోజున బహిరంగ పార్టీలపై కూడా అధికారులు నిషేధం విధించారు. 

మహారాష్ట్రపై కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా అక్కడ కొత్త కేసులు పెరుగుతుండటంతో పాటు ఒమిక్రాన్‌ వ్యాప్తి కూడా విపరీతంగా ఉంది. అంతక్రితం వారంతో పోలిస్తే కేసుల సంఖ్య 5 రెట్లు పెరగడం గమనార్హం. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 198 కొత్త వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 450కి పెరిగింది. వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నిన్న కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌తో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఈ క్రమంలోనే ముంబయిలో కొత్త ఆంక్షలు విధిస్తూ పోలీసులు నేడు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని