EVM: ఓటీపీతో ఈవీఎం తెరవలేం - ‘మహా’ వివాదంపై ఎన్నికల అధికారి

ఈవీఎం అనేది ఓ స్వతంత్ర వ్యవస్థ అని దాన్ని అన్‌లాక్‌ చేసేందుకు ఓటీపీ అవసరం లేదని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

Published : 16 Jun 2024 21:29 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఓ కౌంటింగ్‌ సెంటర్‌లో మొబైల్‌ ఫోన్‌తో ఈవీఎం అన్‌లాక్‌ చేసినట్లు వార్తలు రావడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. వీటిని  ఎన్నికల అధికారులు తోసిపుచ్చారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగే ప్రసక్తే లేదన్నారు. వాటి సురక్షితంగా ఉంచేందుకు భద్రతాపరమైన సాంకేతిక విధానాలున్నాయన్నారు. అంతేకాకుండా వాటిని అన్‌లాక్‌ చేసేందుకు ఓటీపీ అవసరం లేదని స్పష్టం చేశారు. ముంబయి నార్త్‌వెస్ట్‌ నుంచి గెలుపొందిన శివసేన అభ్యర్థి సన్నిహితుడు కౌంటింగ్‌ సెంటర్‌లో మొబైల్‌ ఫోన్‌ వాడారని వచ్చిన వార్తలపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు.

‘‘ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ. దాన్ని తెరవాలంటే ఓటీపీ అవసరం లేదు. అందులో ఎటువంటి ప్రోగ్రామ్‌ ఉండదు. దాంతో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ కూడా సాధ్యం కాదు. ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా అబద్ధం. తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు సదరు పత్రికకు నోటీసులు పంపించాం’’ అని ముంబయి నార్త్‌వెస్ట్‌ లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి వందనా సూర్యవంశీ పేర్కొన్నారు. ఫోన్‌ వాడిన విషయంలో శివసేన అభ్యర్థి బావమరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. డేటా ఎంట్రీ కోసం లాగిన్‌ సిస్టమ్‌ తెరవడానికి మాత్రమే ఓటీపీని.. ఏఆర్‌వో వినియోగిస్తారని రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు దీంతో సంబంధం లేదన్నారు. 

అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్‌

ఇదిలాఉంటే, జూన్ 4న ముంబయి నార్త్‌వెస్ట్‌ లోక్‌సభ స్థానానికి కౌంటింగ్ జరుగుతున్న సమయంలో శివసేన అభ్యర్థి రవీంద్ర వాయకర్‌ బావమరిది మొబైల్‌ ఫోన్‌ వాడారని వార్తలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు మొదలుపెట్టిన ఎన్నికల అధికారులు.. ఆయనకు మొబైల్ ఫోన్ ఇచ్చిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన రవీంద్ర వాయకర్‌, అమోల్ గజానన్ కీర్తికర్‌ (ఉద్ధవ్ వర్గం అభ్యర్థి)పై కేవలం 48 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఫలితాలపై తమ పార్టీకి అనుమానాలు ఉన్నాయని ఉద్ధవ్ వర్గం ఆరోపించడం.. అదే సమయంలో మీడియాలో కథనం రావడం తాజా వివాదానికి కారణమయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని