Lakhimpur Kheri Violence:: యూపీ ఘటనలో కేంద్ర మంత్రి కుమారుడిపై హత్య కేసు నమోదు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఆదివారం రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారుతోపాటు మరో వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో ఆశిష్‌ మిశ్రపై స్థానిక పోలీసులు...

Updated : 04 Oct 2021 14:55 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీలో ఆదివారం రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ కారుతోపాటు మరో వాహనం దూసుకెళ్లింది. ఈ  ఘటనలో నలుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఆశిష్‌ మిశ్రాపై స్థానిక పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మరికొందరి పేర్లూ పొందుపరిచినట్లు సమాచారం. ఇరుపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు అదనపు డీజీ తెలిపారు. ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తుగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు నిలిపివేశారు. స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు రైతులపై దూసుకెళ్లిన కారులో తన కుమారుడు ఉన్నాడన్న వార్తలను మంత్రి ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే.

ప్రియాంకా గాంధీని అడ్డుకున్న పోలీసులు

ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయా రైతు సంఘాలు నేడు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లఖ్‌నవూ నుంచి లఖింపుర్‌ ఖేరి మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాను సీతాపుర్‌ పోలీసులు మార్గమధ్యంలో అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నేనేం నేరం చేయడం లేదు. బాధిత కుటుంబాలను కలిసి, వారి బాధను పంచుకోవాలనుకుంటున్నాను. ఏం తప్పు చేస్తున్నాను? నన్ను అరెస్టు చేసేందుకు మీ వద్ద తగిన వారెంట్ ఉందా?. మీరు నన్ను, నా కారును ఏ కారణంతో ఆపుతున్నారు?’అని ప్రియాంక గాందీ పోలీసులను ప్రశ్నించారు. మరోవైపు పోలీసులు ప్రియాంక గాంధీ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భాఘేల్‌, పంజాబ్‌ ఉప ముఖ్యమంత్రి ఎస్‌ఎస్‌ రాంధవా తదితరులను లఖ్‌నవూ విమానాశ్రయంలో దిగేందుకు యూపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని