Presidential Election: రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూ గెలుపు ఖాయమే..! మమతా బెనర్జీ

రాష్ట్రపతి పదవికి (Presidential Election)పోటీలో ఉన్న ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ (Droupadi Murmu) గెలుపునకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Published : 02 Jul 2022 02:16 IST

కోల్‌కతా: రాష్ట్రపతి పదవికి (Presidential Election) పోటీలో ఉన్న ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ (Droupadi Murmu) గెలుపునకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ముర్మూకు మద్దతిచ్చే అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఓసారి ఆలోచించాల్సిందన్న  ఆమె.. ఎన్‌డీఏ అభ్యర్థిగా నిలబెట్టే ముందు భాజపా కూడా ప్రతిపక్షాలతో చర్చలు జరిపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అందరి ఏకాభిప్రాయంతో ఎన్నికయ్యే వ్యక్తి రాష్ట్రపతిగా ఉండడమే దేశానికి మంచిదని మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.

‘మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులను చూస్తే ద్రౌపదీ ముర్మూ గెలుపునకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముర్మూ పేరును ప్రకటించే ముందు భాజపా మా సలహాలను అడిగితే.. మేము కూడా ఆ విషయాన్ని పరిశీలించేవాళ్లం. అయినా ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే నేను నడుచుకుంటా’ అని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు.

అకాలీదళ్‌ మద్దతు ద్రౌపదికే..

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు రోజురోజుకీ మద్దతు మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే జేడీయూ, వైకాపా మద్దతు ప్రకటించగా.. తాజాగా పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ కూడా తన మద్దతు ముర్మూకేనని ప్రకటించింది. ఈ మేరకు అకాలీదళ్‌ పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ చండీగఢ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. మేం ఎప్పటికీ కాంగ్రెస్‌తో వెళ్లం. ఎందుకంటే ఆ పార్టీ సిక్కులపై అనేక దురాగతాలకు పాల్పడింది’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ గతేడాది శిరోమణి అకాలీదళ్‌ పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని