Elon Musk: మస్క్‌కు ఇప్పుడు తాజ్‌మహల్‌ ఎందుకు గుర్తొచ్చిందో..?

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసే ప్రతి ట్వీట్ వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. తాజాగా ఆయన గతంలో భారత్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, చేసిన పోస్టు కూడా ఊహాగానాలకు తావిస్తోంది. ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ సౌందర్యం అదరహో అంటూ అందులో గుర్తు చేసుకున్నారు. 

Updated : 10 May 2022 12:08 IST

టెస్లా సీఈఓ భారత పర్యటనపై ఊహాగానాలు

దిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ చేసే ప్రతి ట్వీట్ వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది. తాజాగా ఆయన గతంలో భారత్‌కు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ చేసిన పోస్టు కూడా ఊహాగానాలకు తావిస్తోంది. ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ సౌందర్యం అదరహో అంటూ అందులో గుర్తు చేసుకున్నారు. 

తాజాగా ఓ నెటిజన్‌ ఆగ్రా ఫోర్ట్‌ను వర్ణిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. దానికి మస్క్‌ స్పందిస్తూ.. ‘అదొక అద్భుతం. 2007లో నేను భారత్‌కు వచ్చినప్పుడు దానిని సందర్శించాను. అలాగే తాజ్‌మహల్‌ను వీక్షించాను. అది నిజంగా ప్రపంచ వింత’ అంటూ మన ప్రసిద్ధ కట్టడాలను ప్రశంసించారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ ట్వీట్ వైరల్‌ కాగా.. భారత్‌లో మస్క్‌ పర్యటన గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాగా, ఈయన ట్వీట్‌ను ఉద్దేశించి, పేటీఎం బాస్‌ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. మొదటి టెస్లా కారును డెలివరీ చేయడానికి ఇండియాకు ఎప్పుడు వస్తున్నారంటూ ప్రశ్నించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా భారత ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ) దిగుమతిపై 100శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని టెస్లా కోరుతోంది. కొంతకాలం పాటు దిగుమతి చేసిన కార్లను విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది. దిగుమతి చేసిన వాహనాలను కాకుండా.. పాక్షికంగా తయారుచేసిన ఈవీలను దిగుమతి చేసి, దేశీయంగా అసెంబ్లింగ్‌ చేసి విక్రయించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దేశీయంగా అసెంబ్లింగ్‌ చేసుకునేందుకు అవసరమైన విడిభాగాలపై దిగుమతి సుంకం 15-30శాతం మాత్రమే ఉందని చెబుతోంది.

ఈ క్రమంలో భారత ప్రభుత్వం నిబంధనల కారణంగానే టెస్లా రాక ఆలస్యమవుతోందని గతంలో మస్క్‌ ట్వీట్‌ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. ట్విటర్ కొనుగోలు ఒప్పందంతో ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ అయిన ఈ కుబేరుడు.. భారత్‌ రాక ఎప్పుడో చూడాలి మరి..! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని