అలా అయితే ఏడాదిలోపే టీకా నిరుపయోగం..! 

కరోనా వైరస్‌ తీవ్రత భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదముంది. వైరస్‌లో చోటు చేసుకొంటున్న ఉత్పరివర్తనాలు

Updated : 31 Mar 2021 13:09 IST

 కరోనా మ్యుటేషన్లపై ఆందోళన

ఇంటర్నెట్‌డెస్క్‌ : కరోనా వైరస్‌ తీవ్రత భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదముంది. వైరస్‌లో చోటు చేసుకొంటున్న ఉత్పరివర్తనాల (మార్పులు) కారణంగా ప్రస్తుతం ఉన్న టీకాలు ఏడాది అంతకంటే తక్కవ సమయంలోనే నిరుపయోగంగా మారిపోయే ప్రమాదం ఉందని ‘పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్‌’ నిర్వహించిన ఓ సర్వేలో అంటువ్యాధి చికిత్స నిపుణులు అభిప్రాయపడ్డారు. 28 దేశాల్లో అత్యన్నుత విద్యా సంస్థల్లోని 77 మంది నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను రూపొందించారు.  వీరిలో కనీసం మూడో వంతు మంది.. టీకాలు తొమ్మిది నెలల్లో నిరుపయోగంగా మారతాయని అభిప్రాయపడ్డారు. ఇక ప్రతి 8 మందిలో ఒకరు మాత్రం.. ప్రస్తుత టీకాలను వైరస్‌ మ్యుటేషన్లు ప్రభావితం చేయలేవన్నారు. కానీ, అత్యధికంగా మూడింట రెండోంతుల మంది మాత్రం ఏడాది లోపే వైరస్‌ మ్యుటేషన్లు ప్రస్తుత టీకాలను నిరుపయోగంగా మార్చేస్తాయన్నారు. అలాంటప్పుడు ప్రస్తుతం వాడుతున్న తొలితరం టీకాల్లో మార్పులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

‘ఆఫ్రికన్‌ అలయన్స్‌’, ‘ఆక్స్‌ఫామ్‌’, ‘యూఎన్‌ఎయిడ్స్’‌ వంటి 50 సంస్థలు కలిసి ‘పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్‌’ను ఏర్పాటు చేశాయి. ఆ సంస్థ ఈ సర్వేను మంగళవారం నిర్వహించింది. పేద దేశాల్లో వ్యాక్సినేషన్‌ మందకొడిగా జరగడం వల్ల టీకాలను తట్టుకొనేలా వైరస్‌ మార్పులు చెందడానికి కారణం అవుతుందన్నారు. ప్రస్తుత వేగంతో వ్యాక్సినేషన్లు జరిగితే వచ్చే ఏడాదికి ప్రపంచంలోని 10శాతం మంది పేదలకు మాత్రమే టీకాలు అందుతాయన్నారు.

మరోపక్క 2020 రెండో అర్ధభాగం నుంచి ఉత్పరివర్తనాలు చోటుచేసుకున్న కరోనావైరస్‌ రకాలు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇవి వచ్చిన తర్వాత పలు దేశాల్లో  కొవిడ్‌ రెండో దశకు చేరింది. యూకే, దక్షిణాఫ్రికా,బ్రెజిల్‌ రకాలు ఈ కోవకు చెందినవే. మరోపక్క వ్యాక్సిన్‌ రూపకర్తలు కూడా అప్రమత్తమై బూస్టర్‌ షాట్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.  ఈ సర్వేలో పాల్గొన్న జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్శిటీ, యేల్‌, ఇంపీరియల్‌ కాలేజ్‌, లండన్‌ స్కూల్ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌, కేంబ్రిడ్జి, ది యూనివర్శిటీ ఆఫ్‌ కేప్‌టౌన్‌కు చెందిన నిపుణులు ఒక విషయంలో మాత్రం ఏకాభిప్రాయంతో ఉన్నారు. వ్యాక్సిన్‌ టెక్నాలజీ , మేధో హక్కులను ఇతరులతో పంచుకుంటే గానీ వ్యాక్సినేషన్‌ వేగవంతం కాదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని