Kejriwal: దిల్లీని అలా మార్చడమే నా డ్రీమ్‌: సీఎం కేజ్రీవాల్‌

ప్రపంచ దేశాలు దిల్లీ(Delhi)ని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా గుర్తించాలని సీఎం కేజ్రీవాల్‌(Kejriwal) అన్నారు. ఇందుకోసం ఇప్పటికే చాలా చేశామని.. ఇకముందు మరింతగా కృషిచేయనున్నట్టు చెప్పారు.

Published : 03 Mar 2023 22:28 IST

దిల్లీ: దిల్లీ(Delhi)లోని ప్రభుత్వ విద్యారంగంలో ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చామని.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని దిల్లీ సీఎం(delhi cm) అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind kejriwal) అన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి దిల్లీకి వచ్చి చదువుకొనేలా తీర్చిదిద్దడమే తన కల అని చెప్పారు. దిల్లీ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, టాప్‌లో నిలిచిన పాఠశాలలకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. దిల్లీ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎంతగానో కృషిచేశారని ప్రశంసించారు. పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌ సహా అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా తల్లిదండ్రులు సైతం విద్యా వ్యవస్థను మెరుగుపరచడంలో సహకరించారని ప్రశంసించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఉన్న అధ్వాన్నమైన పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఇప్పుడు ఏకరూప విద్యా విధానం తీసుకురావడంతో ప్రైవేటు, ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో అసమానతలు రూపుమాపినట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దిల్లీని ఎడ్యుకేషనల్‌ హబ్‌గా పరిగణించేలా పనిచేస్తున్నట్టు చెప్పారు. మున్సిపల్‌ స్కూళ్లలో ప్రమాణాలను మెరుగుపరుస్తామని.. కౌన్సిలర్లంతా ఆ దిశగా పనిచేసేలా కృషిచేస్తామని చెప్పారు.  ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు- ఉపాధ్యాయుల సమావేశాల్ని తాము ప్రారంభించినప్పుడు పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతో మర్యాదగా పాఠశాల ఆవరణలోకి ఆహ్వానించిన తీరును వారు అభినందించారని గుర్తు చేసుకున్నారు. ప్రతిభా పురస్కారాలు అందుకున్న ప్రిన్సిపాళ్లు, పాఠశాలలు, విద్యార్థులందరికీ ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ శుభాకాంక్షలు చెప్పారు. 

దిల్లీలో ఆప్‌ అధికారంలోకి వచ్చాక విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఇందుకోసం బడ్జెట్‌లో 25శాతం మేర ఆ రంగానికే ఖర్చు చేయడం ద్వారా స్కూళ్లలో మౌలికవసతులను కల్పించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు ఉపాధ్యాయులకు విదేశాల్లో శిక్షణ కూడా అందించారు. ప్రైవేటు పాఠశాలల కన్నా మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా అక్కడి విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. అక్కడి స్కూళ్లను తెలంగాణ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటు అనేక రాష్ట్రాల ప్రముఖులు సందర్శించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా దిల్లీ తరహా విద్యాబోధన అందించేందుకు ప్రత్యేకంగా కొందరు ఉపాధ్యాయులను ఎంపిక చేసి బ్యాచ్‌ల వారీగా సింగపూర్‌ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇకపోతే, వైద్యరంగంలోనూ కేజ్రీవాల్‌ సర్కార్‌ తనదైన మార్కును చూపుతోంది. మొహల్లా క్లీనిక్‌లను ఏర్పాటు చేసి దిల్లీ ప్రజలకు ఉచితంగా వైద్యసేవలందేలా కృషిచేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని