Published : 01 Jul 2022 01:59 IST

Maharashtra: ‘నాన్నే చెప్పేవారు.. మనకు చెందనిది ఎప్పటికీ మనతో ఉండదని..’: ఆదిత్య ఠాక్రే

ముంబయి: మహారాష్ట్ర రాజకీయంలో పలు నాటకీయ పరిణామాల తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే(Uddhav Thackeray) తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఆయన కుమారుడు, శివసేన(Shiv sena) మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే(Aaditya Thackeray) తాజాగా స్పందించారు. సీఎంను సొంత పార్టీ నేతలే మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో ఇలాంటి దుష్టశక్తులు(రెబల్‌ ఎమ్మెల్యేలను ఉద్దేశించి) ఉన్నారని తనకి, తన తండ్రికి ముందే తెలుసన్నారు. కానీ, సొంత పార్టీ మీదే ఇలా తిరుగుబాటు చేస్తారని ఊహించలేకపోయామని చెప్పారు. ఈ మేరకు ప్రముఖ వార్త సంస్థతో గురువారం ఆయన మాట్లాడారు.

‘‘సొంత పార్టీ నేతలని తన కుటుంబసభ్యులుగా సీఎం ఆదరించారు. అలాంటి వ్యక్తిపై తిరుగుబాటు చేస్తారని ఎవరం ఊహించలేకపోయాం. అయినా, సొంత కుటుంబం లాంటి పార్టీపై ఎవరైనా తిరుగుబాటు చేస్తారా? మా నాన్న, తాత, వాళ్ల నాన్న అందరూ అధికారం, డబ్బు వచ్చి వెళ్లిపోతాయనే నమ్మేవారు. అవిపోతే తిరిగి సంపాదించుకోగలం. కానీ, పరువు, గౌరవం ఒకసారి పోతే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. మేం ఈ సిద్ధాంతాన్నే నమ్మాం. ప్రజలకు సేవ చేయడానికే మేము రాజకీయాల్లోకి వచ్చాం. ఇకముందు ఏం జరుగుతుందో కూడా చూస్తాం’’ అని అన్నారు.

వారి సిద్ధాంతం భిన్నమైంది..

ఒకేరకమైన సిద్ధాంతాలున్న భాజపాను కాదని ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారనే శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణమని ఇప్పటివరకు చెప్పుకొచ్చారు. అయితే, దీనిపై ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. ‘‘బాలాసాహెబ్‌ ఠాక్రే హిందుత్వ సిద్ధాంతానికి వారు(రెబల్‌ ఎమ్మెల్యేలు) భావించేదానికి చాలా తేడా ఉంది. మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక నేనూ అయోధ్యకు వెళ్లాను. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు ఉద్ధవ్‌ఠాక్రే రెండుసార్లు వెళ్లి వచ్చారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకున్నాం. కాబట్టి మేం అనుసరించే హిందుత్వ సిద్ధాంతం భిన్నమైంది’’ అని ఆదిత్య ఠాక్రే స్పష్టం చేశారు. 

అసూయపడడం చాలా బాధేసింది..

శివసేన పార్టీలో సీనియర్లను కాదని జూనియర్లకే మంత్రి పదవులు కట్టబెట్టారని పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. చిన్నప్పటి నుంచి తనను చూసినవాళ్లే తన ఎదుగుదలను చూసి అసూయపడడం చాలా బాధగా ఉందన్నారు. ‘‘మేం ప్రతి ఒక్కర్ని గౌరవించాం. 10-12 ఏళ్ల వయసు నుంచి చూస్తున్న పిల్లాడు మంచి పనులు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నాడని.. దాన్ని చూసి సంతోషించి ఆ వ్యక్తిని ఆశీర్వదించాల్సిందిపోయి అసూయపడితే అక్కడ మానవత్వం, నైతిక విలువలు ఏమైపోయినట్టు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

నాన్నే చెప్పేవారు..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలో తన తండ్రి చాలా దయతో వ్యవహరించారని ఆదిత్య ఠాక్రే అన్నారు. ‘‘ఆయనకు సీఎం సీటుతో అసలు మెటీరియల్‌ అటాచ్‌మెంట్‌ ఏం లేదు. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశాక అధికార నివాసం ‘వర్ష’ను వీడారు. రాజీనామా ఇచ్చారు. త్వరలో మళ్లీ వస్తానని రాష్ట్ర ప్రజలకు చెప్పి సీఎం పదవి నుంచి వైదొలిగారు. తగినంత సంఖ్యాబలం లేదని ఆయన అనుకోవచ్చు. ఆయన నాతో ఓ మాట చెప్పేవారు.. మనకు చెందనిది.. ఎప్పటికీ మనతో ఉండదు’’ అని ఆదిత్య ఠాక్రే తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని