Updated : 17 Aug 2022 11:23 IST

Meira Kumar: 100ఏళ్ల క్రితం మా నాన్న జగ్జీవన్‌రామ్‌నూ ఇలాగే కొట్టారు..

దళిత బాలుడి మృతిపై మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ ఆవేదన

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాగునీటి కుండను తాకినందుకు టీచర్‌ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృతిచెందిన ఘటన రాజస్థాన్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ దారుణ ఉదంతంపై లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 100 ఏళ్ల క్రితం తన తండ్రి, దివంగత నేత బాబు జగ్జీవన్‌ రామ్‌కూ ఇలాంటి పరిస్థితే ఎదురైందని.. అయితే అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారని ట్విటర్‌లో వెల్లడించారు.

‘‘100 ఏళ్ల క్రితం జరిగిన ఘటన ఇది. స్కూల్లో అగ్రకులాల వారి కోసం ఏర్పాటు చేసిన ఓ కుండ నుంచి నీళ్లు తాగేందుకు ప్రయత్నించిన మా నాన్న బాబు జగ్జీవన్‌ రామ్‌ను కొట్టారు. అదృష్టం బాగుండి ఆ రోజు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఈ రోజు రాజస్థాన్‌లో ఓ దళిత బాలుడిని ఇదే కారణంతో కొట్టిచంపారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయినా.. కుల వ్యవస్థ ఇంకా మనకు ప్రధాన శత్రువుగానే ఉంది’’ అని మీరా కుమార్‌ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి.

ఈ విషయంపై తాజాగా ఆమె ఓ జాతీయ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. దళిత వ్యక్తి అయిన తన తండ్రి ఎదుర్కొన్న అవమానాలను గుర్తుచేసుకుని బాధపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడి.. ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. ఇప్పటికీ ఆయనను దళిత నేత అని సంబోధించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని అన్నారు. లండన్‌లో తాను అద్దె ఇల్లు కోసం వెతికినప్పుడు చాలా మంది కుల ప్రస్తావన తీసుకొచ్చి తనకు ఇల్లు ఇవ్వలేదని గుర్తుచేసుకున్నారు.

రాజస్థాన్‌లోని జాలోర్‌ జిల్లాలో గత నెల 20న ఓ 9 ఏళ్ల దళిత విద్యార్థి పాఠశాలలో తాగునీటి కుండను తాకాడన్న కారణంగా టీచర్‌ చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు చికిత్స పొందుతూ ఈ నెల 13న ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అటు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ బారా-అత్రు ఎమ్మెల్యే పానాచంద్‌ మేఘ్‌వాల్‌ (కాంగ్రెస్‌) సోమవారం తన పదవికి రాజీనామా చేయగా.. ఆయనకు మద్దతుగా బారా మున్సిపల్‌ కౌన్సిల్‌లో హస్తం పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు తాజాగా రాజీనామా లేఖలు సమర్పించారు. దీంతో సీఎం అశోక్‌ గెహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారుకు చిక్కులు మొదలయ్యాయి.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని