Modi: 130కోట్ల భారతీయుల సంక్షేమం కోసమే నా జీవితం అంకితం : మోదీ

దేశంలోని 130కోట్లకుపైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.

Published : 31 May 2022 15:40 IST

పీఎంకిసాన్ స‌మ్మాన్‌ పథకం 11 విడత నిధులు విడుదల

సిమ్లా: దేశంలోని 130కోట్లకుపైగా పౌరుల సంక్షేమం కోసమే తన జీవితం అంకితమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్‌ నిధి (PM-Kisan) 11వ విడత నిధులు విడుదల చేసిన ఆయన.. తద్వారా 10కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక ప్రతి భారతీయుడి సంక్షేమం, భద్రతే తన తొలి ప్రాధాన్యమన్న మోదీ.. స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్నట్లుగా భారత్‌ను ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నానని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిమ్లాలో ఏర్పాటు చేసిన గరీబ్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌లో పాల్గొన్న మోదీ.. అక్కడ నుంచి దేశవ్యాప్తంగా రైతులతో వర్చువల్‌గా ముఖాముఖి నిర్వహించారు.

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిమ్లాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ.. రైతులతో వర్చువల్‌గా నిర్వహించిన ముఖాముఖిలో మట్లాడారు. ఇందులో భాగంగా రైతుల సమస్యలు, కేంద్ర పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకకు చెందిన సంతోషి అనే మహిళ భావవ్యక్తీకరణ ప్రధాని మోదీని ఎంతగానో ఆకట్టుకుంది. ఒకవేళ ఆమె భాజపా మహిళ అయితే ఎన్నికల్లో పోటీ చేయమని అడిగేవారినని అన్నారు. ఇక లద్ధాఖ్‌ నుంచి మాట్లాడిన ఓ వ్యక్తి తాను జల్‌ జీవన్‌ మిషన్‌.. పీఎం ఆవాస్‌ యోజన కింద లబ్ధి పొందానని చెప్పారు. మరోవైపు బిహార్‌ బంకాకు చెందిన లలితా దేవీ అనే మహిళ.. పక్కా ఇళ్లు, టాయిలెట్‌ పొందినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కిసాన్‌ సమ్మాన్‌నిధి 11 విడత బకాయిలను విడుదల చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. దీని ద్వారా పది కోట్లకు మందికిపైగా రైతులకు రూ.21వేల కోట్ల నిధులను విడుదల చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మండిపడ్డ మోదీ.. వ్యవస్థలో అవినీతిని కూడా ఓ ముఖ్యమైన భాగంగా 2014కు ముందున్న ప్రభుత్వం చూసేదని విమర్శించారు. తమ ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నామన్న మోదీ.. ప్రభుత్వం అర్థాన్నే మార్చేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఓ బాస్‌గా వ్యవహరించడం లేదని.. ఇది కేవలం ప్రజాసేవకుడిగా నడుచుకుంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు