Afghanistan crisis: అఫ్గాన్‌లో అంతర్యుద్ధం.. అమెరికా అంచనాలు!

అఫ్గానిస్థాన్‌లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా జాయింట్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్‌ మిల్లే

Published : 05 Sep 2021 16:26 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా జాయింట్ చీఫ్‌ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ మార్క్‌ మిల్లే  మీడియాకు వెల్లడించారు. అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఉగ్రవాద మూకలు మళ్లీ చెలరేగేలా ఉన్నాయని హెచ్చరించారు. అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దరిమిలా తాలిబన్లు వేగంగా దేశాన్ని ఆక్రమించడం మొదలుపెట్టారు. పంజాషీర్‌ ప్రాంతాన్ని మాత్రం ఆక్రమించలేకపోయారు.

‘అఫ్గాన్‌లోని పరిస్థితులు అంతర్యుద్ధానికి దారి తీసేలా ఉన్నాయి. అల్-ఖైదా, ఐఎస్‌ఐఎస్‌ లాంటి ఉగ్రవాద సంస్థలకు ఆ దేశం పునర్జీవనం ఇచ్చేలా పరిస్థితి మారుతోంది. దీంతో ఉగ్రవాద మూకలు రెచ్చిపోయే అవకాశం ఉంది’ అని ఓ వార్త సంస్థకు మార్క్‌ మిల్లే తెలిపారు. తాలిబన్లు ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని.. అధికారాన్ని ఏకీకృతం చేసి సమర్థవంతమైన పాలనను వారు అందించగలరా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా అఫ్గాన్‌లో రోజువారీగా భయానక పరిస్థితులు ఏర్పడుతుంటే.. అక్కడ ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. రాబోయే మూడేళ్లలో ఉగ్రవాదం మళ్లీ విస్తరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2001లో అమెరికా అఫ్గాన్‌లో అడుగుపెట్టి తాలిబన్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన విషయం తెలిసిందే. కాగా.. తాలిబన్లు తమపై బెదిరింపులకు పాల్పడితే వారిని ఎదుర్కొనే శక్తి తమ దగ్గర ఉందని అమెరికా స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని