
Zoramthanga: మా మంత్రులకు హిందీ అర్థం కాదు.. ఇంగ్లిష్ కూడా రాదు..!
మిజో భాష తెలియని వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా వద్దన్న మిజోరం సీఎం
గువాహటి: మిజోరం ప్రధాన కార్యదర్శిగా రేణు శర్మను నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా కోరారు. ఇలాంటి ఉన్నతమైన పదవికి మిజో భాష తెలిసిన వ్యక్తిని నియమిస్తే బాగుంటుందని, ఎందుకంటే తన కేబినెట్ మంత్రులకు హిందీ, ఇంగ్లిష్ అర్థం కాదని అన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
‘‘రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాగో రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుత అదనపు సీఎస్‌గా ఉన్న జీసీ రామ్‌తంగాను తదుపరి సీఎస్‌గా నియమించాలని కేంద్రాన్ని కోరాను. కానీ హోంశాఖ మాత్రం.. మిజో భాష తెలియని రేణు శర్మను కొత్త సీఎస్‌గా నియమించారు. నిజానికి మిజో ప్రజల్లో మెజార్టీ మందికి హిందీ అర్థం కాదు. నా కేబినెట్ మంత్రుల్లో ఎవరికీ హిందీ భాష అర్థం కాదు. ఇంగ్లిష్ కూడా రాదు. ఇలాంటి పరిస్థితుల్లో మిజో భాష తెలియని వ్యక్తిని సీఎస్‌గా నియమిస్తే సమర్థంగా, ప్రభావవంతంగా పనిచేయలేరు. ఈ కారణంగానే మిజోరం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇక్కడి భాష తెలిసిన వ్యక్తులనే సీఎస్‌గా నియమిస్తూ వస్తోంది. గతంలోనూ ఇలాగే జరిగింది. ఇతర రాష్ట్రాల్లోనూ స్థానిక భాష కనీసం తెలియని వ్యక్తిని సీఎస్‌గా నియమించరు’’ అని జోరంతంగా లేఖలో పేర్కొన్నారు.
అంతేగాక, ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే విశ్వాస భాగస్వాముల్లో తాను కూడా ఒకరినని, అందువల్ల తన అభ్యర్థనను కేంద్రం అర్థం చేసుకుని సానుకూలంగా స్పందిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక తన అభ్యర్థనను కేంద్రం తిరస్కరిస్తే.. ప్రతిపక్షాల ముందు తన నమ్మకాన్ని అపహస్యం చేసినట్లవుతుందని అన్నారు. నిజానికి ఈ లేఖను సీఎం అక్టోబరు 29నే అమిత్ షాకు రాయగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది.
1988 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్‌కు చెందిన రేణు శర్మను మిజోరం కొత్త సీఎస్‌గా నియమిస్తూ అక్టోబరు 28న కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 1ను ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే అదే రోజున మిజోరం ప్రభుత్వం కూడా జేసీ రామ్‌తంగాను సీస్‌గా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం అక్కడ ఇద్దరు సీఎస్‌లు ఉన్నారు. అయితే సీఎం రాసిన లేఖపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాలేదని తెలుస్తోంది.