మయన్మార్‌: నిరసనల వెల్లువ, ఫేస్‌బుక్‌పై నిషేధం

మయన్మార్‌లో సైనిక చర్య ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ ఆంక్షల కొరడాను ఝళిపించింది.

Published : 04 Feb 2021 13:49 IST

యాంగూన్‌: మయన్మార్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న మిలిటరీ.. ఆంక్షల కొరడాను ఝళిపించింది. ఆ దేశంలో ఫేస్‌బుక్‌ వినియోగంపై నిషేధం విధించింది.  బుధవారం అర్థరాత్రి నుంచి ఫేస్‌బుక్‌ అందుబాటులో లేదని అక్కడి నెటిజన్లు ఫిర్యాదు చేశారు. ఇంటర్నెట్‌ సేవలు అందించే ‘టెలినార్‌ మయన్మార్‌’ సంస్థ కూడా ఫేస్‌బుక్‌ నిషేధాన్ని ధ్రువీకరించింది. దేశంలోని సర్వీస్‌ ప్రొవైడర్లు ఫేస్‌బుక్‌ను తాత్కాలికంగా ఆపాల్సిందిగా సమాచార మంత్రిత్వశాఖ ఆదేశించినట్టు వెల్లడించింది.

మాకొద్దీ ప్రభుత్వం..

సోమవారం మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. దేశనాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీతో సహా పలువురు కీలక నేతలను నిర్బంధించి, వారిపై వివిధ కేసులు మోపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని రద్దుచేసిన ఏడాది పాటు పాలన తమ నియంత్రణలోనే ఉంటుందని సైన్యం ప్రకటించింది. ఇదిలా ఉండగా తాము సైనిక ప్రభుత్వం అదుపాజ్ఞల్లో పనిచేయమని అక్కడి వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. ‘‘కబర్‌ మకాయ్‌ బూ..’’ తదితర దేశభక్తి గీతాలను వీరు ఆలాపిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. కరోనా కారణంగా అసలే అరకొరగా ఉన్న ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు మయన్మార్‌ ప్రజలు బుధవారం రాత్రి శబ్ద ప్రదర్శన ద్వారా మిలిటరీ ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను తెలియచేశారు.  అందుబాటులో ఉన్న పాత్రలు, కారు హార్న్‌లు వంటివాటిని మోగించటం ద్వారా వారు నిరసన తెలిపారు. వాకీ టాకీని అక్రమంగా దిగుమతి చేసుకున్న వాడారన్న ఆరోపణతో తమ నాయకురాలు సూకీని అరెస్టు చేయటం అన్యాయమని.. నేషనల్‌ లీగ్‌ డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు ఖండించారు. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలో పాల్గొనాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

రద్దయిన ప్రభుత్వం కూడా తమ నిర్ణయాలను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రజలకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సైన్యంపై వ్యతిరేకత ప్రబలకుండా ఫేస్‌బుక్‌ను నిషేధించింది. కాగా, ఈ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ స్పందించింది. ప్రజలు తమ కుటుంబ సభ్యులు, మిత్రులకు ముఖ్యసమాచారాన్ని తెలియచేసేందుకు వీలు కలిగించాలని, నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా సంస్థ అధికార ప్రతినిధి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నిషేధం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని విమర్శించారు.

ఇవీ చదవండి..

బ్యాట్‌ ఉమన్‌ను కలిసిన WHO నిపుణులు

ట్రంప్‌ వలస విధానాలకు టాటా..


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts